సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటనకు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి ఎలాంటి సంబంధమూ లేదని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఆరెస్సెస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ పేరుతో పత్రికా ప్రకటన విడుదలైంది. తెల్లాపూర్ గ్రామంలో ఇటీవల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహంపై జరిగిన దాడి ఘటన అత్యంత బాధాకరమని, ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనకు, ఆరెస్సెస్ కి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనను ఆరెస్సెస్ కి ఆపాదించి, కావాలనే బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు.
గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో, ఎంతో ఉత్సాహంగా జనవరి 25న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని, అలాగే ఫిబ్రవరి 6న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారని, గ్రామంలోని వారు అందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. కానీ ఈ మధ్యలో కొద్దిమంది అవకాశ వాదులువచ్చి పూలే విగ్రహాన్ని దెబ్బతీయడం ద్వారా గ్రామ ప్రజల్లో సామరస్య వాతావరణంను దెబ్బ తీసి గ్రామం లో ఉద్రిక్త వాతావరణం నిర్మాణం చేశారని తెలిపారు. ఈ సంఘటనను ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆపాదించి, కావాలనే బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
రాజ్యాంగ నిర్మాతలు, దేశభక్తులు మరియు సామాజిక సంస్కర్తల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ అత్యంత గౌరవ భావంతోనే వుంటామని ప్రాంత ప్రచార ప్రముఖ్ తెలిపారు. సమాజంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తుల పట్ల గ్రామ ప్రజలు, యువత చాలా జాగ్రత్తగా ఉండాలని సంఘ్ సూచించింది.



