Home » Nation » Bjpnews: బిజెపి మెడకు చుట్టుకున్న ఆ పథకం మార్పు!

Bjpnews: బిజెపి మెడకు చుట్టుకున్న ఆ పథకం మార్పు!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు బిజెపికి నష్టం చేయనుందా? విపక్షాలు దానిని అస్త్రంగా మార్చుకుంటున్నాయా? ప్రత్యర్థి పార్టీకి ఇది వరంగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన సంగతి తెలిసిందే. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజివికా మిషన్ గ్రామీణ అని పేరు మార్చింది కేంద్రం. షార్ట్ కట్ లో విబి జీరామ్ జీ అని పిలుస్తున్నారు. అయితే ఈ పేరు మార్పు పై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కేవలం పేరు మాత్రమే కాదు.. పథకంలో సైతం సమూల మార్పులు చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా కొన్ని సవాళ్లను.. మరికొన్ని విమర్శలను ఎదుర్కొనేలా చేస్తోంది.

 దశాబ్ద కాలానికి పైగా దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకం అమలవుతోంది. అయితే ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా బిజెపికి మొదటి సమస్య ఎదురవుతోంది. గాంధీజీ పేరును పక్కన పెట్టడం అంటే ఆయన ఆశయాలను, గ్రామీణ స్వరాజ్య భావనను విస్మరించడమే అవుతుందని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ఇది గ్రామీణ ఓటర్లతో పాటు గాంధీజీ పై గౌరవం ఉన్న వర్గాల్లో బిజెపి పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. దేశ స్వాతంత్ర్య చరిత్రను, చిహ్నాలను బిజెపి మార్చడానికి ప్రయత్నిస్తోంది అంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది సిద్ధాంతపరంగా గాంధీకి బిజెపికి వ్యతిరేకమన్న ప్రచారాన్ని మొదలుపెట్టింది.

 ఉపాధి హామీ కొత్త నిబంధనల ప్రకారం ఈ పథకానికి అయ్యే ఖర్చులు కేంద్రం వాటాను తగ్గించారు. రాష్ట్రాల వాటాను పెంచారు గతంలో 25 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. ఇప్పుడు అదనంగా 15 అంటే 40 శాతం రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయం పై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్నచోట మాత్రం తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

 ఉపాధి హామీ పథకం అనేది ఒక చట్టబద్ధమైన హక్కు. కానీ కొత్త విధివిధానాల ప్రకారం ఇది ఒక కేంద్ర ప్రయోజిత పథకంగా మారిపోనుంది. దీనివల్ల డిమాండ్ ఆధారిత పని కల్పన తగ్గుతుందన్న విమర్శలు ఉన్నాయి. పని ఎప్పుడు ఇవ్వాలో కేంద్రం నిర్ణయించడం.. వ్యవసాయ సీజన్ లో పనిని నిలిపి వేయాలని నిర్ణయించడం వంటివి కూలీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఒకవేళ క్షేత్రస్థాయిలో కూలీలకు పని దొరకడంలో జాప్యం జరిగినా.. వేత్తనాలు ఆగినా ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 కొత్తగా ఉపాధి హామీ పథకంలో ఏఐ ఆధారిత ఆడిట్స్, బయోమెట్రిక్ హాజరు, మొబైల్ యాప్స్ వంటి కఠినమైన నిబంధనలు పెట్టడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పారదర్శకత కోసం అని ప్రభుత్వం చెబుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఈ కొత్త విధానం చాలా కష్టమని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు. అనవసరంగా పేరు మార్చడమే కాదు.. విధి విధానాలు మార్చడం కూడా ఈ పథకానికి ఉన్న క్రెడిబిలిటీ పోయింది. అయితే ఈ విషయంలో బిజెపి డామేజ్ కంట్రోల్ ను ఎలా చేసుకుంటుందో చూడాలి.

Share to...