ఎన్డీఏ లోకి( NDA) మరో రాజకీయ పక్షం రానుంది. తమిళనాడులోని సినీ నటుడు విజయ్ పార్టీ బిజెపితో స్నేహం కుదుర్చుకోక అనివార్య పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట, దానిపై జరుగుతున్న సిబిఐ విచారణ కీలక అంశాలుగా మారాయి. నటుడు విజయ్ కొద్ది రోజుల కిందట పివికే పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నది విజయ్ ప్రణాళిక. కానీ అది అంత ఈజీ కాదు. దీంతో విజయ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో చేరుతారని ప్రచారం నడుస్తోంది.
* రాజకీయ ప్రస్థానంలో తొలి దెబ్బ…
విజయ్ ( Vijay) పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కరూర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన సభలో తొక్కిసలాట జరిగింది. 41 మంది మరణించారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తొలినాళ్లలోనే విజయ్ కు ఇది ఊహించని దెబ్బ. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా ఉంటుందని భావించిన విజయ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిబిఐ విచారణ కోరుకున్నారు. తద్వారా తాను తమిళనాడులోని అధికార పార్టీకి వ్యతిరేకం అనే సంకేతాలు పంపించారు. సిబిఐ దర్యాప్తు కోరుకోవడం ద్వారా తాను బిజెపికి దగ్గర అని చెప్పకనే చెప్పారు.
* ఒక ఆయుధంలా చేసుకోవాలని..
ఎప్పటినుంచో తమిళనాడులో బలపడాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆ పార్టీకి విజయ్ ఒక ఆయుధంలా కనిపిస్తున్నారు. విజయ్ తన తొలి రాజకీయ సభలో బిజెపిని సైద్ధాంతిక శత్రువుగా.. డీఎంకేను రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించిన తర్వాత పూర్తిగా పరిణామాలు మారిపోయాయి . తమిళనాడులో విజయ్ ను తమ కూటమిలోకి తెచ్చుకోవడం ద్వారా.. డీఎంకే వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలనేది బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది. నిన్ననే ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. రోజంతా సిబిఐ కార్యాలయంలోనే గడిపారు. కేసు విచారణ పేరుతో విజయ్ ను ఇరకాటంలో పెడుతూనే .. మరోవైపు రక్షణ కల్పిస్తామని హామీతో పొత్తుల దిశగా చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
* రెండే దారులు..
తమిళనాడులో విజయ్ ముందు ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి.. ఒకటి సిబిఐ విచారణను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేయడం.. రెండు డీఎంకే నుంచి ఎదురయ్యే కక్ష సాధింపు చర్యల నుంచి తప్పుకోవడానికి బిజెపితో స్నేహం చేయడం. అయితే బిజెపితో ఆయన చేతులు కలిపితే ఆయన పార్టీ తమిళ జాతీయవాదముద్రను వదులుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆయనకు కేంద్రం అండ అవసరం. అయితే ఎట్టి పరిస్థితుల్లో విజయ్ ను తమ వైపు తిప్పుకోవాలన్నది బిజెపి వ్యూహంగా తెలుస్తోంది. ఒకవేళ విజయ్ ఒప్పుకుంటే మాత్రం తమిళనాడులో సరికొత్త రాజకీయ కూటమి పురుడు పోసుకుంటుంది. అలాకాకుండా విజయ్ ఒంటరిగా వెళ్తే మాత్రం సిబిఐ విచారణ మరింత కఠిన తరం కానుంది. ఇలా ఎలా చూసుకున్నా తమిళనాడు రాజకీయం జాతీయస్థాయిలో ఎన్నో సంచలనాలకు వేదిక కానుంది.



