గవర్నర్( governor) వర్సెస్ గవర్నమెంట్.. ఇప్పుడు ఇది అన్నిచోట్ల వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నచోట ఈ సీన్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా సౌత్ ఇండియాలోని చాలా రాష్ట్రాల గవర్నర్లు.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటివరకు తమిళనాడు, కేరళలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్ల వైఖరి ఉంది. ఇప్పుడు కర్ణాటకలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అక్కడ గవర్నర్ దావర్ చంద్ ద ఫ్లాట్ తీరు కూడా అలానే ఉంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు గాను సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ చదవకుండా పక్కన పడేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
* గవర్నర్ తీరుపై ఆగ్రహం..
ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల్లో( assembly sessions ) భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని గవర్నర్ చదవడం ఆనవాయితీ. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే మాదిరి చేసింది. కానీ గవర్నర్ సభకు వచ్చారు.. ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది.. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్న.. అంటూ రెండే ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్టు పరిస్థితి మారింది. గవర్నర్ తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు సీఎం సిద్ధరామయ్య. గవర్నర్ పై న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
* రెండే ముక్కలతో సరిపెట్టి
రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో( Karnataka) కాంగ్రెస్ పార్టీ. అయితే గత రెండుసార్లు గవర్నర్ ధావర్ చంద్ కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన అసెంబ్లీ ప్రసంగాలను చదివారు. ఈసారి మాత్రం తన ధోరణిని మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలతో ప్రసంగాన్ని సిద్ధం చేసిన తీరును ఆయన ముందుగానే ఆక్షేపించారు. అసలు సభకు వస్తారా రారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే సభకు హాజరైన ఆయన పొడిపొడిగా మాట్లాడి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ పై సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. గవర్నర్ వర్సెస్ గవర్నమెంటు ఎపిసోడ్ తో కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం కనిపించింది. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఆ అంశాలపై అభ్యంతరాలు
గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ కొన్ని అంశాలను చేర్చారు. అందులో ప్రధానమైనది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు.. ఉపాధి హామీ చట్టం రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం.. కేంద్ర నిధుల్లో కర్ణాటక కు అన్యాయం జరుగుతోందని పొందుపరుస్తూ గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేశారు. అయితే దానిపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అంశాలను తొలగించాలని కోరారు. ఒకవేళ తొలగించకపోతే సభలో ప్రసంగించనని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. కానీ సిద్ధరామయ్య( Karnataka CM Siddaramaiah ) ప్రభుత్వం ఆ పని చేయలేదు. అందుకే సభకు వచ్చి గవర్నర్ రెండు మాటలు చెప్పి వెళ్లిపోయారు.
* తమిళనాడులో బహిష్కరణ..
గతంలోనూ తమిళనాడులో ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడి గవర్నర్ ఆర్ ఎన్ రవి( Governor RN Ravi ) ఇదే మాదిరిగా వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో తమిళ తల్లి ప్రార్థన గీతాన్ని మాత్రమే ఆలపించారు. జాతీయ గీతం ఆలపించలేదని.. అది ఆ గీతాన్ని అవమానించడమేనని భావించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు ఇదే మాదిరిగా వ్యవహరించారు తమిళనాడు గవర్నర్. ఈసారి ఏకంగా గవర్నర్ ప్రసంగాన్ని గవర్నరే బహిష్కరించారు తమిళనాడులో. ఈ ఎపిసోడ్ తమిళనాడు అసెంబ్లీ తో పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేసింది.
* కేరళలో సైతం..
కేరళ అసెంబ్లీలో( Kerala assembly ) కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలోని కీలక భాగాలను చదవలేదు. అది పెను వివాదానికి దారి తీసింది. మంత్రివర్గం ఆమోదించి ఇచ్చిన ప్రసంగపాటంలోని ముఖ్య అంశాలను ఉద్దేశపూర్వకంగానే చదవలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆరోపించారు. గవర్నర్ సభ నుంచి వెళ్లిపోగానే సీఎం స్పీకర్ ని కలిసి నిరసన వ్యక్తం చేశారు. సాధారణంగా గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు, రాష్ట్ర హక్కుల గురించి ప్రస్తావించినప్పుడు.. గవర్నర్లు ఇలా సెలెక్టింగ్ రీడింగ్ పాల్పడుతుంటారు. వరుసగా మూడు దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు వివాదాస్పదం కావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.
* గవర్నర్ చుట్టూ చర్చలు..
దక్షిణ భారతదేశంలో గవర్నర్లకు, అక్కడి గవర్నమెంట్ లకు మధ్య విభేదాలు రగులుతూనే ఉన్నాయి. కొత్త ఏడాదిలో అవి పతాక స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు, ప్రాధాన్యతలను, అంతకుముందు ఏడాది పనితీరును ప్రతిబింబించే విధంగా ప్రకటన ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా సరే అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కానీ దక్షిణ భారతదేశంలో బిజెపి వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడులో బిజెపి వ్యతిరేక ప్రభుత్వం డిఎంకె ఉంది. కేరళలోనూ అదే పరిస్థితి. కర్ణాటక తో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ చుట్టూ జరుగుతున్న చర్చలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యున్నత పదవిపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉండాలి. అది ఒక రాజకీయ ఆయుధంగా మారితే మాత్రం ఇలాంటి సంఘర్షణలు తప్పవు.



