డిప్యూటీ సీఎం లకు సీఎం స్థాయి భద్రత.. కేంద్రం పై పెరుగుతున్న ఒత్తిడి!
డిప్యూటీ సీఎం( deputy CM).. ఇది ప్రత్యేకమైన పదవి. ఒక హోదా కూడా. ప్రత్యేక హక్కులు ఉండవు కానీ.. ముఖ్యమంత్రి తరువాత స్థాయిని తెలియజెప్పే పదవి అది. అయితే డిప్యూటీ సీఎం పోస్టు అనేది రాజకీయ ఆధిపత్యం ఉన్నచోట సర్దుబాటుకు సృష్టించిన ఒక పదవి మాత్రమే. అయితే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ డిప్యూటీ సీఎం పదవిని క్రియేట్ చేస్తున్నారు. బలమైన నేతలకు ఆ పదవులు కట్టబెడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. ఒక్క కేరళ మినహాయించి అన్ని రాష్ట్రాలకు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్, తెలంగాణలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మల్లు భట్టి విక్రమార్క, కర్ణాటకలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా బలమైన వర్గానికి చెందిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా బలమైన నేతలు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మహారాష్ట్రకు వరుసగా ఆరుసార్లు డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు అజిత్ పవర్. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్న బలమైన నాయకుల భద్రతపై లోతైన చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రితో సమానంగా డిప్యూటీ సీఎం లకు భద్రత కల్పించడం లేదా? అనే ప్రశ్న వినిపిస్తోంది.
* అసాధారణ భద్రత..
ముఖ్యమంత్రులకు( chief ministers ) అసాధారణ భద్రత ఉంటుంది. మావోయిస్టులతో పాటు ఇతర సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంటే ఎక్కువ సెక్యూరిటీ కూడా కల్పిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హై సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకులకు భద్రతాపరంగా అనేక అంచెలుగా సెక్యూరిటీ ఉంటుంది. డిప్యూటీ సీఎం లకు మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదమే లేదు. కేవలం సీఎం, మంత్రివర్గ ప్రస్తావన మాత్రమే ఉంటుంది. డిప్యూటీ సీఎం అనేది హోదా మాత్రమే. వారు మిగతా మంత్రులతో సమానమే. కాకపోతే డిప్యూటీ సీఎం అనేది ఒక గౌరవం.
* వారి భద్రతపై చర్చ..
అయితే అజిత్ పవర్( Ajit Pawar ) ప్రమాదం నేపథ్యంలో.. డిప్యూటీ సీఎంల భద్రతపై ప్రత్యేక చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రులతో సమానంగా వారికి సైతం భద్రత కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నచోట మాత్రమే ఈ డిప్యూటీ సీఎం పోస్టులు తెరపైకి వస్తున్నాయి. లేకుంటే ఒకే పార్టీలో ఇద్దరు నేతల మధ్య ముఖ్యమంత్రి పదవికి పోటీ జరిగితే డిప్యూటీ సీఎం ప్రతిపాదన వస్తోంది. అయితే అజిత్ పవర్ విమాన ప్రమాదంలో చనిపోయారని తెలిసిన వెంటనే దీని వెనుక కుట్ర ఉందని ప్రత్యర్థులు ఆరోపణ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే మహారాష్ట్రలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. అందులో సొంత పార్టీలను విభేదించి.. అడ్డగోలుగా చీల్చి బయటకు వచ్చిన వారే. అయితే ఒక్క మహారాష్ట్రలోనే కాదు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. రాజకీయ ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం లకు సైతం ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
* సెక్యూరిటీ పెంచాలి..
రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు. వారి ప్రస్తావన కూడా లేదు. అందుకే వారికి అసాధారణ భద్రత అనేది కల్పించడం లేదు. అయితే దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి స్థాయితో సమాన గౌరవం అందుకున్న డిప్యూటీ సీఎంలకు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ రాష్ట్రాల నుంచి వస్తోంది. అప్పుడే ఇటువంటి ప్రమాదాలకు సైతం చెక్ చెప్పవచ్చు. ఐదు అంచెల భద్రత ఉంటుంది కనుక ప్రమాదాలకు అవకాశం ఉండదు.



