Home » Nation » Megastar: మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ.. ఏపీ నుంచి పెద్దల సభకు?!

Megastar: మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ.. ఏపీ నుంచి పెద్దల సభకు?!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ.. ఏపీ నుంచి పెద్దల సభకు?!

మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? మరోసారి రాజకీయాల్లోకి వస్తారా? రాజ్యసభ పదవి దక్కనుందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇటీవల ఆయన నటించిన శివ శంకర వరప్రసాద్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటువంటి తరుణంలో చిరంజీవి పొలిటికల్ రీయంట్రీ పై వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. త్వరలో ఆయన పెద్దల సభలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు చిరంజీవి. అయితే పొలిటికల్ ఇమేజ్ కంటే.. వెండితెరే మేలు అన్న నిర్ణయానికి వచ్చారు. రాజకీయ రంగానికి గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోయారు.

* గతంలో కూడా ప్రచారం..
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ పై ప్రచారం ఇప్పటిది కాదు. గతంలో కూడా అటువంటి ప్రచారం జరిగింది. కానీ నో నెవర్.. మరోసారి రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని చిరంజీవి తేల్చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు మద్దతు ప్రకటించారు. ఆదరించాలని మెగా అభిమానులను కోరారు. తద్వారా కూటమికి సపోర్ట్ చేయాలని సంకేతాలు పంపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవితో ఎంతో ఉల్లాసంగా గడిపారు.

* పిఆర్పి తో ప్రవేశం..
2009లో ప్రజారాజ్యం( Praja Rajyam) పార్టీ ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకున్నారు. దాదాపు 70 లక్షల ఓట్లు సాధించింది ప్రజారాజ్యం పార్టీ. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కేంద్రమంత్రి పదవిని పొందారు. 2014లో జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఓడిపోవడంతో క్రమేపి ఆ పార్టీకి దూరమయ్యారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లో చేరిపోయారు చిరంజీవి.

* రాజ్యసభకు ఆయన పేరు..
అయితే ఇప్పుడు మరోసారి ఆయన పొలిటికల్ రీయంట్రీ ఇస్తారని ప్రచారం ప్రారంభం అయింది. ఈ ఏడాది జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. అందుకే ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్( Election Commission) సన్నాహాలు ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు ప్రమోట్ అవుతారని ప్రచారం మొదలైంది.

* అత్యవసర భేటీ..
ఏపీ సీఎం చంద్రబాబు తో( CM Chandrababu) ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. అది రాజ్యసభ పదవి కోసమేనని ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. భారతీయ జనతా పార్టీ 2, టిడిపి రెండు పదవులను తీసుకున్నాయి. ఇంతవరకు రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి చాన్స్ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు సీఎం చంద్రబాబు తో చర్చలు జరిపినట్లు ప్రచారం నడుస్తోంది. రాజ్యసభకు చిరంజీవిని పంపించడం ద్వారా కూటమికి వచ్చే ప్రయోజనాలపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు అంటున్నారు చిరంజీవి. మరి ఇప్పుడు రాజ్యసభ పదవిపై జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.

Share to...