గాలి జనార్దన్ రెడ్డి( gaali Janardhan Reddy ).. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది మైనింగ్. ఆ రంగానికి మకుటం లేని మహారాజుగా ఎదిగారు. కర్ణాటక రాజకీయాలతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఏపీ పాలిటిక్స్ ను కూడా శాసించారు. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం బళ్లారిలో క్రమేపి తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆయనను రాజకీయ ప్రత్యర్థులు సైతం వణికిస్తున్నారు. తాజాగా బళ్లారిలో జరిగిన కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మృతి చెందడం సంచలనంగా మారింది. బళ్లారిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. బళ్లారికి ఒకప్పుడు అప్రకటిత రాజుగా వ్యవహరించేవారు గాలి జనార్దన్ రెడ్డి. అటువంటి నేత ఇప్పుడు భయపడుతున్నారు. తనపై హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని భయపడుతూ చెబుతుండడం విశేషం.
* కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపు..
మొన్నటి ఎన్నికల్లో బళ్లారి( bhallari ) నగరంలో పట్టు బిగించింది కాంగ్రెస్ పార్టీ. సిటీ ఎమ్మెల్యేగా నారా భారత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. గాలి జనార్దన్ రెడ్డికి నిత్యం సవాళ్లు విసురుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జనార్ధన రెడ్డిని పూచిక పుల్లగా తీసి పడేశారు. వయసు గుర్తు చేసి మరి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మైనింగ్ డాన్ గా పేరు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డికి ఏకంగా ఓ సామాన్య ఎమ్మెల్యే సవాల్ విసరడం అసమాన్యమే అని చెప్పవచ్చు.
* విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు..
బళ్లారి లోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరమంతా ఫ్లెక్సీలు కట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నారా భారత్ రెడ్డి( Nara Bharat Reddy) ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డి నేతృత్వంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు జరుగుతోంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి నివాసం ప్రహరీ గోడకు ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. తమ నాయకుడి ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టవద్దని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. అది తీవ్రతరంగా మారి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
* కాంగ్రెస్ గురి..
అయితే ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి పై కాంగ్రెస్( Congress) కార్యకర్తలు గురి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఆయన కారు దిగగానే పరిస్థితి మరింత విషమించింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి గాలి జనార్దన్ రెడ్డికి కాల్పులు ఎదురైనట్లు కన్నడ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఘటనలో గాలి జనార్దన్ రెడ్డికి ఏమీ జరగలేదు. కానీ కాంగ్రెస్ కార్యకర్త ఒకరు చనిపోయారు. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
* వయసు పేరుతో హెచ్చరికలు
అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్సెస్ గాలి జనార్దన్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ఇద్దరి మధ్య గట్టిగానే మాటల యుద్ధం జరుగుతోంది. వాల్మీకి విగ్రహ ఏర్పాటును అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని.. తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని నారా భరత్ రెడ్డి పై గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే తమ కార్యకర్తను హత్య చేశారని.. బళ్లారిలో శాంతిని దెబ్బతీసేందుకు గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నారా భరత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గాలి జనార్దన్ రెడ్డి ప్రభావం లేకుండా చూడాలన్న కసి నారా భరత్ రెడ్డి లో కనిపిస్తోంది. అయితే తన పాత కోటను తిరిగి దక్కించుకోవాలన్న ఆరాటం గాలి జనార్దన్ రెడ్డిలో ఉంది. అయితే అది అంత ఈజీగా తేలే అవకాశం లేదు. ఎందుకంటే నారా భరత్ రెడ్డి వయస్సు 35 సంవత్సరాలు. దానినే గుర్తుచేస్తూ గాలి జనార్దన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు భరత్ రెడ్డి. అయితే గాలి జనార్దన్ రెడ్డికి ధీటుగా భరత్ రెడ్డి నాయకత్వం బళ్లారిలో పెరుగుతుండడం.. మున్ముందు మరిన్ని సంచలన ఘటనలు జరిగే అవకాశం ఉంది.



