ఏపీకి ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్( Bill Gates) రానున్నారు. ఈనెల 16న ఏపీకి వస్తున్నారు. తొలుత ఈనెల 18న వస్తారని అంతా భావించారు. అయితే రెండు రోజులు ముందుగానే రాష్ట్రానికి వస్తున్నారు బిల్ గేట్స్. సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై సమీక్షించనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అందించేందుకు ఒప్పందం చేసుకోనున్నారు. ఆయా రంగాల్లో మెరుగైన ఫలితాల కోసం ఈ ఒప్పందం జరగనుంది. అమరావతి వేదికగా ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కీలక అడుగు పడనుంది. సాంకేతిక రంగంలో పరస్పర సహకారం పై చంద్రబాబుతో బిల్ గేట్స్ కీలక చర్చలు జరపనున్నారు.
* ఇదివరకే అవగాహన..
ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాలలో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి( AP government) సహకారం అందించేందుకు ఇదివరకే ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. 2025 మార్చిలో ఏపీ ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఏఐ టెక్నాలజీ వినియోగంతో పాటు రియల్ టైం డేటా వ్యవస్థలను అమలు చేయడంలో చంద్రబాబు విజన్ ను బిల్ గేట్స్ ప్రశంసిస్తూ లేక సైతం రాశారు. ప్రధానంగా హెల్త్ ఎనలిటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్, ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
* పెట్టుబడులు పెట్టేందుకు..
మరోవైపు బిల్ గేట్స్ పర్యటనపై మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. అమరావతిలో( Amravati capital ) ప్రతిపాదిత క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీలో ఈ అంశంపై ప్రతిపాదన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఏపీఐటి రంగానికి ఇది మరింత ప్లస్ గా మారనుంది. పలు రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి టెక్నాలజీ సహకారంతో పాటు పెట్టుబడులకు సంబంధించిన అంశంపై బిల్ గేట్స్ పర్యటన రోజు స్పష్టత రానుంది. దీనికోసమే రాజకీయ, పారిశ్రామిక వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
* సుదీర్ఘ అనుబంధం..
బిల్ గేట్స్ తో చంద్రబాబుకు( CM Chandrababu) సుదీర్ఘ అనుబంధం ఉంది. బిల్ గేట్స్ అభిమానించే నేతలలో చంద్రబాబు ప్రధానంగా ఉంటారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ అధినేతను సీఎం చంద్రబాబు ఆశ్చర్యపరిచారు. అనంతరం హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ రావడానికి ఈ ఘటన కారణం అయ్యింది. హైదరాబాద్ నగరాన్ని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దడంలో ఒక చారిత్రాత్మక అడుగు అది. దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్ సైతం ఐటీ హబ్ గా మారేందుకు ఎంతగానో దోహదపడింది. అందుకే బిల్ గేట్స్ ఏపీ పర్యటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించ గలుగుతోంది.



