యాంకర్ అనసూయ ( anchor anasuya).. ఇటీవల తరచూ వివాదాల్లో వినిపిస్తున్న మాట ఇది. మొన్నటికి మొన్న నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు అనసూయ. సినీ పరిశ్రమలో హీరోయిన్లతో పాటు నటీమణుల వస్త్రధారణ పై శివాజీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలు ఈ కామెంట్స్ పెను దుమారానికి దారితీశాయి. ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇంతలోనే అనసూయ మరో బాంబు పేల్చారు. అయితే గతంలో తాను చేసిన తప్పుడు వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ నటి కి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
* రాశి హాట్ కామెంట్స్
సీనియర్ నటి రాశి( senior actor Raasi ) ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా మెరుస్తున్నారు. తాజాగా ‘రాశి గారి ఫలాలు’ కామెంట్స్ పై నటి రాశి తీవ్రంగా స్పందించారు. పేరు ఎత్తకుండానే యాంకర్ అనసూయ భరద్వాజ్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే వెంటనే దీనిపై అనసూయ స్పందించారు. రాశికి క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల కిందట ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరోజు తనతో అలా మాట్లాడించిన డైరెక్టర్, స్కిట్స్ రాసిన వ్యక్తిని నిలదీయాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు అనసూయ. ఆ సమయంలో తన శక్తి చాలలేదని… మనుషులు మారుతారని.. ఆ షో విడిచి పెట్టాక తనలో మార్పును గమనించాలని అనసూయ కోరడం విశేషం.
* సోషల్ మీడియాలో ఆ వీడియో..
ఓవైపు శివాజీ( actor Sivaji) వివాదంపై హాట్ హాట్ గా ఉన్న తరుణంలో.. అనసూయ హోస్టుగా వ్యవహరించిన ఓ కామెడీ షోలోని క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ‘ నువ్వు రాశి గారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా? అని అనసూయ అంటే.. అవి రాశి గారి ఫలాలు కాదు.. రాశి ఫలాలు.. అని హైపర్ ఆది అంటాడు. ఈ వీడియోను చూపిస్తూ అనసూయని నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. పలువురు సెలబ్రిటీలు సైతం అనసూయ ను తీవ్రంగా విమర్శించారు. నెట్టింట వైరల్ అవుతున్న రాశి గారి ఫలాలు వీడియో పై నటి రాశి ఘాటుగా స్పందించారు. ఆ లేడీ యాంకర్ అంటూ అనసూయ పేరు ఎత్తకుండా ఫైర్ అయ్యారు.
* జరిగింది ఇది..
మూడేళ్ల కిందట బుల్లితెరలో ఓ పాపులర్ షో( popular show) నుంచి నటి రాశికి ఫోన్ వచ్చిందట. ప్రేయసి రావే మూవీకి సంబంధించి స్కిట్ చేయాలని కోరారట. అయితే అటువంటి సినిమాను టచ్ చేయకూడదని భావించి రాశి నో చెప్పారట. అవసరం అయితే జడ్జిగా రమ్మంటే వస్తాను అని చెప్పారట. ఆమె వద్దన్నా ఆ షోలో స్కిట్ చేశారు. రాశి గారి ఫలాలు అంటూ సంబోధించారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నటి రాశి. అనసూయ పేరు ఎత్తకుండానే ఆ యాంకర్ నా గురించే మాట్లాడింది. అక్కడ జడ్జిల్లో ఒక లేడీ కూడా నవ్వేసింది. సహచర నటిని అని కనీసం ఆలోచించలేదు. నేను ఆ ప్లేస్ లో ఉండి ఉంటే ఆ షో ఆపేసి.. రాశి గారి ఫలాలు అని ఎందుకు అంటున్నారు అని నిలదీసే దాన్ని. కామెడీ చేయొచ్చు కానీ.. బాడీ షేమింగ్ చేయడానికి కన్న తల్లిదండ్రులకు కూడా రైట్ లేదు. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాశి. ప్రస్తుతం శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్టు ఉంది పరిస్థితి. మధ్యలో తన పేరు రావడంతోనే నటి రాశి స్పందించినట్టు చెబుతున్నారు.
* వివాదానికి కార్నర్ కావడంతో
అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అనసూయ కార్నర్ అవుతుండడంతో ఆమె స్పందించారు. నటి రాశికి క్షమాపణలు కోరారు. తనకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో అప్పట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని.. నిలదీసి అడిగేంత శక్తి కూడా తనకు అప్పట్లో లేదని అనసూయ వాపోయారు. వెనక్కి వెళ్లి ఆ తప్పును సరిదిద్దలేనని.. తనను క్షమించాలని కోరింది అనసూయ. ఈరోజు మహిళల భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న తనకు వ్యతిరేకంగా కొంతమంది పాత వీడియోలను తీసి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని వాపోయింది. తనను అవమానించేందుకు నటి రాశి ని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే శివాజీ వర్సెస్ అనసూయ అన్న వివాదం రాశికి క్షమాపణల వరకు చేరింది. మున్ముందు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.



