Subramanyam Dogiparthi :హీరో వెంకటేష్ అయితే షీరో జయసుధ . వెంకటేష్ , రాఘవేంద్రరావుల కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమా ఈ ఒంటరి పోరాటం .1989 లో వచ్చిన ఈ సినిమా స్టోరీ రొటీన్ పగ సాధింపే అయినా పరుచూరి బ్రదర్స్ కొత్త కలనేతలతో నేసారు .
చాలా సినిమాల్లో లాగానే మేనమామ దౌష్ట్యానికి బలయిన మేనల్లుడు తాను ఆ మేనమామకు మేనల్లుడు అని తెలవకుండానే సవాల్ విసురుతాడు . ఆ సవాలుకు ప్రధాన కారణం ఆ మేనమామ కూతురు కూడా . అలా మేనమామ , మరదలు ఇద్దరితో హీరో వెంకటేష్ నాలుగేళ్ళలో మేనమామ కన్నా ఎక్కువ సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు .
ఇంతవరకే అయితే ఓకే . గెలిస్తే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాననే షరతు కూడా ఉంటుంది . ఇది ఆధునిక నాగరిక కాలంలో అన్యాయం . పందెం కాయటానికి కూతురిని ఫణంగా పెట్టే కధల్ని రచయితలు వ్రాయటం అన్యాయం .
మరో సవాల్ జయసుధ , సత్యనారాయణల మధ్య . ఈ సవాల్ ఏకంగా ద్రౌపది లాగా శపథం . సత్యనారాయణ అంతు చూసేదాకా కురులు ముడవననే ఛాలెంజ్ . ఈ ఛాలెంజ్ కొరకు హీరో వెంకటేషుని బాణం లాగా వదులుతుంది . ఇద్దరికీ కామన్ విలన్ సత్యనారాయణే .
మధ్యలో సత్యనారాయణకు తోడు జయసుధ మాజీ భర్త మోహన్ బాబు కూడా చెయ్యి కలుపుతాడు . జయసుధ , వెంకటేషులు కలిసి సత్యనారాయణను ఓడించి జైలుకు పంపుతారు . క్లైమాక్స్ ఫైటింగ్ సీన్లో జయసుధ మాజీ భర్తను చంపేసి జైలుకు వెళుతుంది . మేనమామ కూతురిని పెళ్ళి చేసుకోవడంతో సినిమా శుభాంతం అవుతుంది .
ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరికయినా గుర్తుకొచ్చే సీన్ : ఓ బిల్డింగులో లిఫ్ట్ దగ్గర ఆడవాళ్ళ రద్దీని కంట్రోల్ చేయటానికి అద్దాలు పెట్టడం . ఆ తర్వాత గుర్తుకొచ్చేది జయసుధను ఒంటి కాలి మీద నిలబెట్టడం .
నటనపరంగా మొదటి మెప్పు వెంకటేష్ , జయసుధలకే . ఇలాంటి పాత్రలకు ఇద్దరూ పెట్టింది పేరు . మెయిన్ హీరోయినుగా ఫరా . టైటిల్సులో శ్వేత అని వేసారు ఎందుకనో . ఈ ఫరా టాబూ అక్క . గ్లామర్ బొమ్మ .
సెకండ్ హీరోయిన్ రూపిణి . తమిళ హీరోయిన్ . మోహన్ బాబు , సత్యనారాయణలకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . మోహన్ బాబుది soft looking cruel villainy . ఇతర పాత్రల్లో సుధాకర్ , చిట్టిబాబు , అన్నపూర్ణ , బ్రహ్మానందం , మమత , శుభ , శివాజీ రాజా , పి జె శర్మ , తదితరులు నటించారు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటల చిత్రీకరణ రాఘవేంద్రరావు స్టైల్లో ఉండవు . వేటూరి , జొన్నవిత్తుల వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , చిత్రలు పాడారు . బయట గొప్పగా హిట్ కాలేదు కానీ థియేటర్లో బాగానే ఉంటాయి .
అన్నీ వెంకటేష్ , ఫరాల మీద డ్యూయెట్లే . పెదవి మీద ముద్దు ప్రేమ కొద్ది దిద్దు , మేడలొద్దు మిద్దెలొద్దు , నువ్వు రెడీ నేను రెడీ వయసు రెడీ బావా , టిప్పు టాపు సోకులాడి , పడాలి ప్రేమ లోన అంటూ సాగుతాయి పాటలు .
పరుచూరి బ్రదర్స్ డైలాగులు సినిమాకు బలం . రాఘవేంద్రరావు మేజిక్ కధనంలో , స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది . సినిమా యూట్యూబులో ఉంది . It’s a pure commercial , feel good entertainer .



