Home » Movies » vijayashanthi: విజయశాంతి మరో ప్రతిఘటన

vijayashanthi: విజయశాంతి మరో ప్రతిఘటన

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

Subramanyam Dogiparthi: మరో ప్రతిఘటన . ఆ సినిమాలో లెక్చరర్ , ఈ సినిమాలో టీచర్ . రెండింటిలోనూ విజయశాంతి విరాట నటనను చూస్తాం . గ్లామర్ హీరోయినుగా వచ్చి ఎర్ర షీరోగా మారిన విజయశాంతికి ఈ భారతనారి వందో సినిమా . ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా స్వంతం చేసుకుంది . 

చట్టాలను గౌరవించే పౌరులను కూడా వ్యవస్థలను తమ గుప్పిట్లలో పెట్టుకుని తమ దుర్మార్గాలను ప్రశ్నించే పౌరుల మీద తప్పుడు కేసులు బనాయించి , బూటకపు ఎన్కౌంటర్లను చేసి/చేయించి నక్సలైట్లుగా , అర్బన్ నక్సలైట్లుగా మార్చే సోషల్ నక్సలైట్ల , రాజకీయ నక్సలైట్ల స్టోరీ ఈ సినిమా . 

మరో సారి ప్రకాశం జిల్లా ఎర్ర కళాకారులయిన పోకూరి వారి కుటుంబాన్ని , వారికి సన్నిహితులయిన రచయిత యం వి యస్ హరనాధరావుని , దర్శకుడు ముత్యాల సుబ్బయ్యని ప్రత్యేకంగా అభినందించాలి . విజయశాంతి పాత్రని అద్భుతంగా మలిచారు . ఒక టీచరుగా , అభ్యుదయవాదిగా , సంస్కారవాదిగా ప్రారంభమై హింసే ఆఖరి ప్రత్యామ్నాయం అని తీర్మానానికి వచ్చి బహిరంగంగా పోలీస్ ఇనస్పెక్టర్ విలన్ని చంపేస్తుంది ఈ పాత్ర . 

Law abiding పౌరులను కూడా కుళ్ళిన వ్యవస్థలో ఆ చట్టాన్నే భంగం చేయాలని కార్నర్ చేయబడటం చూస్తూనే ఉన్నాం . చట్టం అమాయక , అనాధ ప్రజల విషయంలో తన పని తాను చేసుకుపోతుంది . MLAలు , MPలు , సెలబ్రిటీలు రేపులు చేసినా , రివాల్వరుతో కాల్పులు జరిపినా , గొడ్డళ్ళతో నరికినా చట్టం వాళ్ళకు చుట్టం అయిపోయిందే అని సాధారణ పౌరులకు బాధ కలుగుతుంది . ఇవన్నీ ఉన్నాయి ఈ సినిమలో . 

టూకీగా కధ ఏంటంటే : ఓ ఊళ్ళో టీచరుగా పనిచేసే భారతి అనే యువతి మీద MLA గారి బావమరిది దేవరాజ్ గారు మనసు పారేసుకుని ఆమె చేతిలో దెబ్బలు తింటాడు . ఆమెను పెళ్లి చేసుకునేలా MLA సుత్తి వేలు ప్రయత్నించి భంగపడతాడు . భారతి సంచార గ్రంధాలయాన్ని నడిపే వినోద్ కుమార్ని పోలీసు స్టేషన్లో ఎర్ర పెళ్లి చేసుకుంటుంది . 

కక్ష కట్టిన బావమరిది గారు ఆ ఊరికే SI గా వచ్చి భారతిని మానభంగం చేసి , వినోద్ కుమార్ని , కానిస్టేబుల్ని షూట్ చేసి తీవ్రవాదిగా ముద్ర వేసి శిక్ష తప్పించుకుంటాడు . భారతి అహింసా మార్గంలో ప్రభుత్వాన్ని కదిలిస్తుంది . 

MLA గారి మీద , SI మీద ఒత్తిడి పెరుగుతుంది . విజయశాంతిని తీవ్రవాదిగా చూపించి జైల్లో వేసేస్తాడు . జనం తీవ్రవాదులు అయి ఆమెను జైలు నుండి తప్పిస్తారు . క్లైమాక్సులో హింసా మార్గంలో బహిరంగంగా చంపి , విలన్ చేతిలో విజయశాంతి కూడా చనిపోవటంతో సినిమా ముగుస్తుంది . 

విజయశాంతి తర్వాత అద్భుతంగా నటించింది సుత్తి వేలు . కామెడీ , కేరెక్టర్ పాత్రలే కాదు విలన్ పాత్రలను కూడా అద్భుతంగా పండించగలను అని వేలు రుజువు చేసుకున్నాడు . వేలు తర్వాత తాంబూలం నర్రా , దేవరాజ్ , ముక్కు రాజు , సంజీవ్ , రాళ్ళపల్లిలదే . బ్రహ్మాండంగా నటించారు . 

ముఖ్యంగా సుత్తి వేలు మహాత్మాగాంధీ లాగా వేషం వేసుకుని పిల్లల్ని మోసం చేసి కేసులో నుంచి బావమరిదిని తప్పించటం బాగుంటుంది .‌ మరో ముఖ్యమైన SI పాత్రలో మురళీమోహన్ , భారతి తల్లిదండ్రులుగా పి యల్ నారాయణ , రాజేశ్వరి , లాయరుగా పోకూరి బాబూరావు , ఎంతో మంది ఔత్సాహికులు నటించారు . 

ఎప్పటిలాగే నిర్మాతలు షూటింగుని ఒంగోలు , పక్కనే ఉన్న మండువ వారి పాలెం గ్రామంలో షూటింగ్ జరిపారు . చక్రవర్తి సంగీతాన్ని అందించారు . శ్రీశ్రీ గారి యముని మహిషపు లోహ ఘంటల్ మబ్బు చాటున ఖణేల్ మంటాయి అనే గీతాన్ని చక్కగా , సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు . 

ఓరి మనిషో ఏడ పుట్టుకొచ్చావ్ అంటూ సాగే డప్పు పాట సంజీవి మీద బ్రహ్మాండంగా చిత్రీకరించబడింది . అలాగే విజయశాంతి పాడే రాజ్యమా స్వరాజ్యమా పాట ప్రతిఘటన సినిమాలో పాటను గుర్తుకుతెస్తుంది . భలే భలే పెళ్ళి , బంగారు తల్లిరో అంటూ సాగే స్కూల్ పిల్లల పాట చాలా శ్రావ్యంగా ఉంటాయి . పాటల్ని జాలాది , అదృష్టదీపక్ వ్రాయగా బాలసుబ్రమణ్యం , వందే మాతరం శ్రీనివాస్ , రమణ , పద్మజలు పాడారు . 

నిస్సందేహంగా 1989 జూలైలో వచ్చిన ఈ భారతనారి సినిమా ఓ సామాజిక , రాజకీయ ఆణిముత్యం . విజయశాంతి కీర్తి కీరీటంలో మరో కలికితురాయి . ఇంత గొప్ప ఎర్ర సినిమాకు దర్శకత్వం వహించిన ముత్యాల సుబ్బయ్యని , నిర్మాతలు పోకూరి వారి కుటుంబాన్ని అభినందించాలి . ఇంతకముందు చూడనట్లయితే యూట్యూబులో తప్పక చూడండి . Worth watching and unmissable too . 

 

Share to...