Home » Movies » Maheshbabu: రౌడీకి శిష్యుడిగా మహేష్ బాబు

Maheshbabu: రౌడీకి శిష్యుడిగా మహేష్ బాబు

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

Subramanyam Dogiparthi : ప్రముఖ నటి నదియా నటించిన మొదటి తెలుగు సినిమా 1988 ఆగస్టులో వచ్చిన ఈ బజార్ రౌడీ . ద్విపాత్రాభినయం కూడా . కృష్ణ సమర్పించిన ఈ సినిమాలో ఆయన ఇరువురు కుమారులు రమేష్ బాబు , మహేష్ బాబు నటించారు .‌ బజార్ రౌడీగా రమేష్ బాబు , అతని శిష్యుడిగా , ఆల్ ఇండియా కృష్ణ ఫేన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా మహేష్ బాబు నటించారు . 

చిక్కని కధ , బిర్రయిన స్క్రీన్ ప్లే , పదునైన మాటల్ని అందించిన సత్యమూర్తిని మొదటగా అభినందించాలి . ఆ తర్వాత అభినందనలు పండిపోయిన దర్శకుడు కోదండరామిరెడ్డికి . ఎక్కడా బోరించకుండా లాగించేసారు . 

నదియా క్రాంతి అనే పత్రికకు అధినేత , చీఫ్ ఎడిటర్ . ఆమె తండ్రి పత్రిక వ్యవస్థాపకుడు భీమేశ్వరరావు నేరాలను చేసే , చేపించే కాంట్రాక్టర్ సత్యనారాయణ వలన చనిపోతాడు . పోతూ పోతూ అహోబలరావుని వదలిపెట్టవద్దని చెప్పి చనిపోతాడు . నదియా సత్యనారాయణ చేసే అక్రమాలను పత్రికలో ప్రచురిస్తూ ఉంటుంది . 

ఇద్దరి మధ్య డైరెక్ట్ వార్ మొదలవుతుంది . నదియా కజిన్ శుభలేఖ సుధాకర్ని సత్యనారాయణ కిడ్నాప్ చేస్తాడు . విడిపించుకోవటానికి బజార్ రౌడీ రమేష్ బాబుని రంగంలోకి దింపుతుంది . 

సినిమాలో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది . నదియా పోలికలతో మరో నదియా ఒక హత్య కేసులో నేరస్తురాలు . ఆమెను తప్పించమని తండ్రి ప్రభాకరరెడ్డి సత్యనారాయణను ఆశ్రయిస్తాడు . బజార్ రౌడీ సహాయంతో అసలు నదియాని కిడ్నాప్ చేయించి నకిలీ నదియాని పత్రిక అధినేత సీట్లో కూర్చోబెడతాడు . 

అసలు నదియానే నేరస్తురాలిగా కోర్టులో రుజువు చేసి ఉరిశిక్ష పడేలా చక్రం తిప్పుతాడు . కిడ్నాప్ చేసిన సమయంలో అసలు నదియా బజార్ రౌడీని ప్రేమించేస్తుంది . దానితో అసలు నదియాను ఉరిశిక్ష నుంచి రక్షించటానికి బజార్ రౌడీ రంగంలో దిగి ఆఖరి నిమిషంలో గవర్నర్ దగ్గర నుండి స్టాప్ ఆర్డర్ని ఇప్పిస్తాడు . అయితే ఈ క్లైమాక్సులో నకిలీ నదియా చనిపోతుంది . అసలు నదియా , బజార్ రౌడీలు ఒకటవటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

సినిమాలో పత్రికల నైతిక , సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావన పుష్కలంగా ఉంటుంది . 1980s కాస్తో కూస్తో మీడియాకు నైతిక బాధ్యత ఉన్న రోజులు కదా ! అప్పుడప్పుడే మీడియాని కులాలకు , రాజకీయాలకు , డబ్బుకు తాకట్టు పెట్టడం ప్రారంభం అయింది . 

రాజ్ కోటి సంగీత దర్శకత్వం ఆహ్లాదకరంగా ఉంటుంది . ముఖ్యంగా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది . రమేష్ బాబు , నదియా , గౌతమి , సీతల మీద ఈ నాలుగు డ్యూయెట్లు ఉంటాయి . అన్నీ బాగా చిత్రీకరించబడ్డాయి . నృత్య దర్శకురాలు తారని , పాటల్ని శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలను అభినందించాలి . 

ఓ ప్రేమా ఓ ప్రేమా నమహో నమః , తాకమాక తగ్గమాక , సింగారక్కో సిగ్గెందుకో , చెక్కిలిగిలి చిక్కుల ముడి అంటూ సాగుతాయి ఈ నాలుగు డ్యూయెట్లు . అయిదో పాట రీమిక్స్ పాట . చాలా సరదాగా సాగుతుంది . నకిలీ నదియాను టీజ్ చేస్తూ కుటుంబ సభ్యులు అందరూ పాడతారు . కొత్త పెళ్ళి కూతురా రావమ్మా అంటూ సాగుతుంది . 

కృష్ణ , రాధ అతిధి నటులుగా తళుక్కుమనే ఈ సినిమాలో రమేష్ బాబు , మహేష్ బాబు , నదియా , గౌతమి , సీత , నిర్మలమ్మ , శుభలేఖ సుధాకర్ , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి , వయ్యారాల వై విజయ , రమణమూర్తి , ప్రదీప్ శక్తి , భీమేశ్వరరావు , పి జె శర్మ , ప్రభృతులు నటించారు . 

మంచి సినిమా . అప్పటికే మళయాళ సినిమా రంగంలో నాలుగేళ్ళ నుండి నటిస్తున్న నదియా సత్యనారాయణకి ధీటుగా బాగా నటించింది . మహేష్ బాబు ఎనర్జిటిక్ గా నటించాడు . కోదండరామిరెడ్డి డైరెక్షన్ కనిపిస్తుంది . వెరశి చూడతగ్గ సినిమా . నటీనటుల ఎఫెక్ట్ కన్నా కధ , కధనం , దర్శకత్వం ఎఫెక్టే బాగా కనిపిస్తాయి . కృష్ణ ఫేమిలీ సినీ అభిమానులు తప్పక చూసే ఉంటారు . చూడనివారు వెంటనే యూట్యూబులో చూసేయవచ్చు .

Share to...