Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నారు. ‘అఖండ’ సినిమాతో మొదలైన బాలయ్య హవా ‘అఖండ2’ వరకు కొనసాగుతోంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమహారాజ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలన్ని రూ.100 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద బాలయ్య సత్తా ఏంటో చూపించాయి. అంతేకాకుండా సీనియర్ హీరోల్లో నంబర్ వన్‌గా నిలిచారు. ఇదే ఊపుతో మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు అభిమానులకు అందించేందుకు రెడీ అయ్యారు.
తనకు వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. NBK 111 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో పోరాట యోధుడి పాత్రల్లో నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై క్యూరియాసిటీ పెంచింది. ఇక ఈ సినిమా నుంచి మరో అప్టేడ్ బాలయ్య అభిమానులకు మరింత కిక్ ఇచ్చేలా ఉంది. ఈ మూవీలో బాలయ్య స్వయంగా పాట పాడనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు థమన్ వెల్లడించారు. బాలయ్య పాడే పాట బాహుబలి మూవీలోని సాహోరే బాహుబలి పాటలాగా ఉంటుందని తెలిపారు.
గతంలో పైసా వసూల్ మూవీలో ‘అరె మామా ఏక్ పెగ్‌లా’ పాట పాడిన బాలయ్య తన గాత్రంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. చారిత్రక అంశాలతో ముడిపడిన యాక్షన్ డ్రామాగా మూవీ తెరకెక్కనుంది. బాలకృష్ణ రెండు భిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార శక్తిమంతమైన రాణిగా అలరించనుంది. వచ్చే ఏడాది ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



