విద్యార్థులే అతిథులుగా.. ‘సీపీతో ఒక రోజు’
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్ పోలీస్
Bharat Today : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచడంతో పాటు వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసు విభాగం ‘సీపీతో ఒక రోజు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోలీసుల పనితీరును క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిరోజూ ఒక పాఠశాల నుంచి ప్రతిభగల 20 మంది విద్యార్థులను (10 మంది బాలురు, 10 మంది బాలికలు) ఎంపిక చేసి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసు విభాగంలోని వివిధ విభాగాలను సందర్శింపజేస్తారు.
వీర హనుమాన్ విజయ యాత్రకు బందోబస్తు ఏర్పాట్లపై వీడియో కాన్పరెన్స్
బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ‘సీపీతో ఒక రోజు’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. మంగళహాట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలోనే బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కార ప్రక్రియను వారికి ప్రత్యక్షంగా వివరించారు.అనంతరం వారికి పుస్తకాలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు.
వివిధ విభాగాలను సందర్శించిన విద్యార్థులు
అంతకుముందు వారు పర్యటనలో భాగంగా బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు మెయిన్ పీసీఆర్, ఐటీ సెల్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ వింగ్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ వంటి కీలక విభాగాలను సందర్శించారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు విద్యార్థులతో నేరుగా ముచ్చటించి, నేరాల నియంత్రణలో సాంకేతికత పాత్ర, మహిళా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యతలను వివరించారు. ప్రజలతో పోలీసులు ఎలా మమేకమవుతారో విద్యార్థులు స్వయంగా చూసి తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.



