# విశాఖలో మెరిసిన అనంత కిరణాలు: ‘సృజన 2026’ విజేతగా SKU ఇంజనీరింగ్ కళాశాల.
# క్యాన్సర్ డిటెక్షన్, క్వాంటం క్యూఆర్ఎన్జీ ప్రాజెక్టులకు గోల్డ్ మెడల్స్.. సృజన పోటీల్లో ఎస్‌కేయూ విద్యార్థుల రికార్డు.
విశాఖపట్నం, భారత్ టుడే: సాంకేతిక నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచే ABVP ‘సృజన 2026’ వేదికపై అనంతపుర కిరణాలు మెరిశాయి. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు.
హ్యాక్థాన్ పోటీలో రికార్డు విజయం:
ABVP ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో సృజన కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హ్యాక్థాన్’ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 118 టీమ్‌లు పాల్గొన్నాయి. అయితే, “MRI Scan Cancer Detection” (MRI స్కానింగ్ ద్వారా క్యాన్సర్ గుర్తింపు) అనే వినూత్న ప్రాజెక్టును ప్రదర్శించిన SKU ఇంజనీరింగ్ విద్యార్థులు అందరికంటే మెరుగైన ప్రతిభ కనబరిచి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
పేపర్ ప్రజెంటేషన్‌లోనూ నెంబర్ 1:
కేవలం హ్యాక్థాన్‌కే పరిమితం కాకుండా, పేపర్ ప్రజెంటేషన్ విభాగంలోనూ SKU విద్యార్థులు తమ ఆధిపత్యాన్ని చాటారు. మొత్తం 18 టీమ్‌లు పోటీపడగా, “QUANTUM QRNG” అనే అత్యాధునిక సాంకేతిక అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించి మొదటి బహుమతిని గెలుచుకున్నారు.


