నియోజకవర్గాల పునర్విభజనపై వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్దాం: జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్
ప్రజలకు అందుబాటులో ఉండాలి.. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
# రాష్ట్రంలో పెరగనున్న 88 అసెంబ్లీ, 12 పార్లమెంట్ స్థానాలు.
# డీలిమిటేషన్ ప్రక్రియపై అధ్యయనానికి ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు.
# వారంలో ఒకరోజు ప్రజల నుంచి తప్పనిసరిగా అర్జీల స్వీకరణ.
# జెన్ జీ (Gen Z) ఆలోచనలకు అనుగుణంగా పార్టీ బలోపేతం.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా, వాస్తవిక దృక్పథంతో ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. 2009లో చివరిసారిగా పునర్విభజన జరిగినప్పుడు రాష్ట్రం, దేశంలో చోటు చేసుకున్న అంశాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా, ప్రజాప్రయోజనమే పరమార్థంగా, సహేతుకంగా పునర్విభజన జరిగేలా జనసేన ప్రజా ప్రతినిధులు ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా జనసేన ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలకు చేరువలో (రీచ్ అవుట్) ఉంటూ… నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో మంగళవారం విజయవాడలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నియోజక వర్గాల పునర్విభజన నిర్ణయం వల్ల రాష్ట్రంలో అసెంబ్లీతోపాటు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడున్న నియోజకవర్గాలను 50 శాతం పెంచాలన్న కేంద్రం నిర్ణయం హర్షణీయం. కేంద్రం నిర్ణయంతో 88 అసెంబ్లీ సీట్లు, 12 వరకు పార్లమెంట్ సీట్లు కొత్తగా పెరుగుతాయి. అంటే కొత్తగా 100 మంది ప్రతినిధులను చట్ట సభలకు పంపించే అవకాశం వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ ఎక్కడా దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత మనపై ఉంది. డీలిమిటేషన్ పై జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ఎటువంటి కార్యాచరణ అవలంబించాలి? అనే అంశాలపై సూచనలు చేయడానికి శాసనసభ్యులతో కూడిన కమిటీ నియమించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి సూచిస్తున్నాను. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీలిమిటేషన్ పై పార్టీ కార్యాచరణ నిర్దేశించుకుందాం.
• ప్రత్యేక ప్రణాళికతో స్థానిక పోరుకు సిద్ధమవుదాం
కొద్ది నెలల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు పని చేయాలి. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఏ ఎన్నిక జరిగినా గెలుపే లక్ష్యంగా కష్టపడాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అభిలషణీయమైన సంఖ్యలో గెలుపొందడం మన శ్రేణుల పోరాట పటిమకు నిదర్శనం. వచ్చే స్థానిక పోరులో గెలుపే లక్ష్యంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.



