బడి పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం.. అనే చిన్న పథకం ఓ వెనుకబడిన రాష్ట్రం యొక్క తలరాతను.. ఆ రాష్ట్రం యొక్క దశా దిశను సమూలంగా మార్చేసి.. ఈరోజున ఆ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టిన సంగతి మీకు తెలుసా??..
ఒక్కసారి 1960 ల్లోకి వెళ్తే..
ఓ మారుమూల పల్లెలో పేద కల్లుగీత కుటుంబం నుండి వచ్చిన ఒక పెద్దాయన! ఆయనకి చదువు లేదు! పెళ్ళి పెటాకులు లేవు! సొంత ఇల్లు కూడ లేదు! ఆయన ఆస్తి కేవలం కొన్ని చొక్కాలు.. కొన్ని అడ్డ పంచలు! మరి ఇప్పుడు ఆ పెద్దాయన గురించి చెప్పుకోవడానికి ఆయన ఏం చేశాడు??..
ఆయన చదువుకోక పోయినప్పటికి.. ఈ సమాజంలో ఉన్న ఈ కులమతాల జాడ్యం, ఈ వివక్ష పోవాలంటే.. పేదోడి బతుకులు మారాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గం అని బలంగా నమ్మడమే కాదు.. ఆ చదువుని నేరుగా ఆ ప్రతి పేదవాడి ఇంటికే చేర్చాడు! నా రాష్ట్రంలో అసలు బడి లేని గ్రామమే ఉండడానికే వీలు లేదని తేల్చిచెప్పాడు!
దానికోసం ఈ దేశ చరిత్రలోనే మొదటి సారి ఆ రాష్ట్రంలో 18 వేల ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశాడు.. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడిని పదకొండవ తరగతి వరకు ప్రభుత్వమే పూర్తి ఉచితంగా చదివించాలని ఏకంగా ఓ చట్టమే చేశాడు!
అంతేకాదు.. నా పేద పిల్లలెవరూ ఆకలితో పేదరికంతో చదువు మానేయడానికి వీలు లేదని.. కనీసం ఒకపూట భోజనం కోసమైనా ఆ పేద పిల్లవాడు బడికి వచ్చి చదువుకుంటాడని.. Slate in one hand.. Plate in one hand అంటూ పిలుపునిచ్చి.. దేశ చరిత్రలోనే మొదటిసారి బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించాడు..
దాంతో అప్పటివరకు కేవలం 7% శాతం ఉన్న ఆ రాష్ట్ర అక్షరాస్యత రేటు ఆయన పదవిలోనుండి దిగే సమయానికి 37 శాతానికి చేరుకుంది! అంతేకాదు ఆయన చూపిన దారిలోనే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా నడవడంతో.. అప్పటివరకూ పెద్దగా ఏ వనరులు లేని ఆ రాష్ట్రం ఆ తరువాతి కాలంలో చదువే పెట్టుబడిగా అభివృద్దిలో అన్ని రంగాల్లో ప్రగతిపధంలో దూసుకుపోయింది!
ఆయనెవరో ఈపాటికే మీకు అర్ధం అయ్యుంటుంది! ఆయనే “కామరాజార్” అని మనం గౌరవంగా పిలుచుకొనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. One of our all time great visionary in indian politics స్వర్గీయ కామరాజ నాడార్!
ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే.. నిన్నటి రోజున ఓ కడుపు నిండిన So called పండితుడు ఒకాయన పైత్యం ప్రకోపించి.. ప్రవచనాల పేరుతో పేదోడి పిల్లలు తినే మధ్యాహ్న భోజనంపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఒక్కసారి RTE Act 2009 ఏం చెప్తుందో.. పిల్లల మధ్యాహ్న భోజనంపై 2001 సుప్రీంకోర్టు ఏం చెప్పిందో.. అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21-A ఏం చెప్తుందో సదరు ప్రవచన కారుడికి.. ఆయన్ను వెనుకేసుకొచ్చే గుంపుకి.. ఎవరైనా గుర్తు చెయ్యండి!
మధ్యాహ్న భోజనం అంటే.. పేదల మీద దయతలచి ప్రభుత్వాలు వేసే భిక్ష కాదు.. రాజ్యాంగం ప్రకారం ప్రతి బడి వయసు పిల్లవాడికి ఈ దేశం దాఖలు పరిచిన హక్కు!!



