Home » Latest » పెళ్లి సంబంధాలు.. పెను సవాళ్లు: ఐటి ప్యాకేజీల మాయలో మంటగలుస్తున్న వివాహ బంధాలు!

పెళ్లి సంబంధాలు.. పెను సవాళ్లు: ఐటి ప్యాకేజీల మాయలో మంటగలుస్తున్న వివాహ బంధాలు!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

జాతకాలు సాకు మాత్రమే.. అసలు మెలిక ప్యాకేజీల దగ్గరే! పెళ్లిళ్ల మార్కెట్‌లో ‘సీనియర్’ పెళ్లికూతుళ్ల డిమాండ్.

సాఫ్ట్‌వేర్ కొలువులే కొలమానమా? నేటి తరం పెళ్లిళ్లలో మారుతున్న ప్రాధాన్యతలపై ప్రత్యేక విశ్లేషణ.

వయసు దాటితే మనసున్నా వ్యర్థమే: వివాహ వ్యవస్థలో పెరుగుతున్న ‘పెళ్లికాని ప్రసాదులు’, ‘ప్రసూనలు’.

   డి. స్వాతి, విజయవాడ (వెటరన్ జర్నలిస్ట్ ) : ” నా చేతను… నీ చేతను , వరమడిగిన కుంతి చేత, వాసువు చేతన్, గురు చేతను, ధర చేతను, శల్యు చేత అరయంగ కర్ణుడు ఒరిగెన్ ఆర్గురి చేతన్ ” మహాభారత యుధ్ధంలో కర్ణుడు పడిపోవడానికి కృష్ణుడు చెప్పిన కారణాలివి. ప్రస్తుతం యువతకు సాంప్రదాయంగా పెళ్ళి సంబంధాల కుదిరేందుకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. 

పెళ్ళి సంబంధాలు అనగానే

ప్రథమంగా చూసేది శాఖా భేదాలు, తర్వాత ఉద్యోగ హోదాలు, జాతకాలు, ‘కొలువు’ తీరిన ప్రాంతాలు, ఆస్తి పాస్తులు, కుటుంబ స్థాయి, వృత్తి ప్రాధాన్యతలు, ఇలా ఎన్నో విషయాలు దాటుకుని వచ్చినా చివరకు అసలు మెలిక ప్యాకేజీల దగ్గర పడుతోంది. మిగతా అన్నీ బాగున్నా ప్యాకేజీ నచ్చకపోతే జాతకాలు సాకుగా చూపించి సంబంధాలను తిరస్కరిస్తున్నారు. ఇందుకు అమ్మాయిలు, అబ్బాయిలు , అమ్మా నాన్నలు; ఆర్థిక,సామాజిక పరిస్థితులు; అత్యాశలు; జీవితంపై అవగాహనా రాహిత్యం , భవితపై ముందుచూపు కొరవడటం వంటివి ఇలా ఎన్నెన్నో తెరవెనుక ప్రభావితం చేస్తున్నాయి.

శాఖా భేదాల పట్టింపు :

పిల్లల చదువులు, ఉద్యోగాలు, అభిరుచుల విషయంలో కాలానుగుణంగా మారుతున్న పెద్దలు పెళ్ళి సంబంధాలప్పుడు మాత్రం శాఖా పట్టింపులకు పోతున్నారు. దీనివల్ల సంబంధాల చాయిస్ లు తగ్గిపోతున్నాయి. ఒకవైపు ప్రేమ పెళ్ళిళ్ళ పేరుతో అన్య మతస్థులు, కులాల వారినీ చేసుకుపోతున్న ఈ రోజుల్లో ఇంకా శాఖా భేదాలు పాటించడం అవసరమా…? శాఖ ఏదైనా ఒకేకులం అయితే చాలు అనుకోవాలి కదా. అవసరాన్ని బట్టి ఇతర రాష్ట్రాలోని అదే కులంలోని శాఖల నుంచి కూడా సంబంధాలు కుదుర్చుకోవడం ఆమోదయోగ్యమే అని స్వయంగా కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా మననం చేసుకోవడం అవసరం.

ఐటి రంగ ప్రభావం:

ఆధునిక సమాజంలో ఐటి రంగ ప్రభావం కేవలం ఉద్యోగాల మీదే కాదు మన వివాహ వ్యవస్థపై కూడా చాలా తీవ్రంగా వుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం మన దేశంలో ప్రవేశించిన ఐటి రంగం సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో యువతను ఊరించి ఉరుకులు పెట్టించింది. యువత ప్రతిభకు, కెరీర్ కు అదే లక్ష్యంగా పరిణమించింది. మగపిల్లలతో సమంగా ఆడపిల్లలు కూడా అందులో ప్రవేశించి దూసుకుపోతున్నారు. ప్యాకేజీలే వారి ప్రతిభకు గుర్తింపుగా మారాయి. ఆ ఉద్యోగాలన్నింటికీ మెట్రోపాలిటన్ సిటీలే నెలవులైనాయి. దాంతో అందులో పనిచేసే యువతీయువకులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆ రంగంలో పనిచేసే వాళ్ళనే, అక్కడి వారినే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. దాంతో ఆ రంగంలోవి తప్ప ఇక ఏ ఇతర రంగాల ఉద్యోగాలు వారి కంటికి ఆనడంలేదు. అందులోనూ చిన్న కంపెనీలు కాకుండా ఎంఎన్సీలో ఉద్యోగాలు, అమెరికాలో కొలువులు అయితేనే ఆకర్షణీయమైన ప్యాకేజీలు వుంటాయని ఆశల పల్లకిలో విహరించడం మొదలైంది.

అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ ఉద్యోగస్థుల్లోనూ కొంత అభద్రతా భావం, అమెరికా సంబంధాలపట్ల వెనుకంజ కనబడుతున్నాయి. 

ఇతర ఉద్యోగాలు , వృత్తులపై చిన్న చూపు:

ఐటి రంగం తర్వాత వృత్తి విద్యల్లో వున్న వైద్యులు,ఇంజనీర్ల వైపు కొంత మొగ్గు చూపినా ఆ స్థాయిలో న్యాయవాద వృత్తిలో వున్నవారికి, ఆడిటర్లకు, టీచింగ్ ఫీల్డ్ లో వున్న వాళ్ళకి, బిజినెస్ చేసేవారికి అంత ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఇక మిగతా చిన్న ఉద్యోగాలు, కుల వృత్తులు చేసే వాళ్ళనయితే తృతీయ శ్రేణిగా పరిగణిస్తున్నారు. అసలు సమాజం అంటేనే ఎన్నో వృత్తులు, రంగాల సమాహారం కదా. ఆ స్పృహే మరిచి ఐటి ఉద్యోగాలు, ప్యాకేజీలే పెళ్ళి కి కొలమానంగా భావించే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి. ఇతర వృత్తులు, రంగాలవారికి ఓ పట్టాన పెళ్లిళ్ళు కుదరకపోవడానికి ఇదో పెద్ద ఆటంకం అయింది. 

కాగా ఇప్పుడు వైద్యవిద్య చదివిన అమ్మాయిలు చాలామంది కనబడుతున్నారు. ఆ స్థాయిలో అబ్బాయిల సంఖ్య కనబడకపోవడంతో అదే వృత్తిలో వున్న అబ్బాయిల సంబంధాలు దొరకడం వారికీ కష్టంగానే వుంది. 

పురోహితులు,, అర్చకుల పరిస్థితి మరీ దయనీయం:

తమ కులవృత్తిగా అర్చకత్వం, పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణ కుటుంబాలలో అబ్బాయిల సంబంధాలు కుదరడం దాదాపు అసాధ్యం అవుతున్నాయి. చిన్న ఉద్యోగాలు, ఉపాధి లో వున్న అమ్మాయిలు కూడా వీరిని చేసుకోవడానికి ముందుకు రావడంలేదు. నిజానికి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తూ, స్వేచ్ఛగా జీవిస్తూ, ఆస్తిపాస్తులు వున్నాకూడా ఈ వృత్తి లో వున్న అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడంలేదు. ఇదే వృత్తిలో ఉన్న తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లలను కులవృత్తి చేసుకునే అబ్బాయిలకు ఇవ్వడానికి సుముఖంగా లేరు.దీంతో విసిగిపోయిన ఆ అబ్బాయిలు క్రమంగా ఆ వృత్తి నుంచి బయటపడి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఇది మున్ముందు ఆ వృత్తి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రాంతాల విభేదాలు కూడా:

అమ్మాయిలూ, అబ్బాయిలూ కూడా తాము ఏ సిటీలో ఉద్యోగం చేస్తుంటే అదే సిటీలో పనిచేసే వాళ్ళనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఐటి రంగానికి సంబంధించి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, పూనే, ఢిల్లీ, ముంబాయి ఇలా ఎక్కడ చేసే వాళ్ళకి అక్కడ ఉద్యోగులే కావాలి. ఆపైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో చేస్తున్నవారికి అక్కడి సంబంధాలే కావాలి. అంటే వృత్తుల ఎంపిక లాగానే ప్రాంతాల ఎంపిక పట్లా చిన్నచూపు కనబడుతోంది. విదేశాల తర్వాత మన దేశంలో మెట్రోపాలిటన్ సిటీలో చేసే వారికి వున్న డిమాండ్ పట్టణాలలో చేసేవారికి వుండదు. నిజానికి వాళ్ళలో ఎంతో మంది బాగా స్థిరపడినవారూ స్థితిమంతులు వున్నా కూడా వాళ్ళకి సంబంధాలు ఓ పట్టాన కుదరట్లేదు. వాళ్ళు నివసిస్తున్న ప్రాంతమే వాళ్ళకు ఓ మైనస్ అవుతోంది.

అమ్మల అతి జోక్యం:

ఒకప్పుడు సంబంధాలు మాట్లాడడంలో తండ్రులది కీలక పాత్ర అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని తల్లులు కైవసం చేసుకున్నారు. సంబంధాలు చూడడంలో, అవతలి వాళ్ళతో మాట్లాడడంలో అమ్మలు ముఖ్యంగా అమ్మాయిల తల్లుల పాత్రపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అనడం కొందరికి కోపాన్ని తెప్పించవచ్చు. అనేకమంది నుంచి వచ్చిన నిజాల ద్వారా ఈ విషయాన్ని చెప్పక తప్పడం లేదు. అబ్బాయిల తరఫు నుంచి. ఎవరు కాంటాక్ట్ చేసినా తల్లే ముందుగా రంగప్రవేశం చేసి వారిని అనేక ప్రశ్నలతో నిలదీస్తుంటారు. ఫోన్లకు సరిగా స్పందించరు. తండ్రి లేని కుటుంబాలలో అయితే ఆ బాధ్యత తల్లి తీసుకోవడం తప్పనిసరి. కానీ తండ్రి వున్న ఇళ్ళ నుంచి కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతోందని పలువురి ఆవేదన. 

ప్రతిదానికీ వంకలు పెట్టడంతో మరికొన్ని :

పెద్ద పెద్ద సంపాదనలకు, స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడిన అమ్మాయిలు ఎన్నిసంబంధాలు తెచ్చినా ఏదో వంకతో వాటిని తిరస్కరిస్తున్నారు. పెళ్ళయ్యాక బాధ్యతల బరువుకూ భయపడుతున్నారు. అందుకే పెళ్ళిని వాయిదా వేస్తున్నారు. ఇక కొందరు తల్లిదండ్రుల విషయానికి వస్తే అమ్మాయి సంపాదన వల్ల వచ్చే అనేక సౌకర్యాలకు అలవాటు పడి , అమ్మాయి పెళ్ళయివెళ్ళిపోతే అవన్నీ దూరం అవుతాయన్న భయంతో ఓ పట్టాన సంబంధాలు పడనివ్వడంలేదు. కొందరికి ఇది కష్టమనిపించినా కాదనలేని వాస్తవమిది. 

అబ్బాయిలూ తక్కువేంకాదు:

 కొందరు అబ్బాయిల తరఫు వాళ్ళు కూడా తమ ప్రశ్నలతో, డిమాండ్లతో , సందేహాలతో చికాకు పెడుతున్నారని అమ్మాయిల తరఫు వాళ్ళూ ఆరోపిస్తున్నారు. ఇలా ఇరుపక్షాల వాళ్ళలో కొందరి అహంకారపూరిత ప్రవర్తన వల్ల సంబంధాలు కుదరడం లో సంకట స్థితి ఏర్పడుతోంది.

ఈ అబ్బాయికి పెళ్ళవుతుందా:

చాలా కాలం క్రితం పొత్తూరు విజయలక్ష్మి అనే రచయిత్రి ఓ కథకి పెట్టిన పేరది. అబ్బాయి పెళ్ళి అవ్వడానికి ఎన్నెన్ని ఆటంకాలు, అవస్థలు ఎదురైనాయో ఆ కథలో హాస్యం గా చెప్పారు. కానీ ఇప్పటి సామాజిక పరిస్థితుల్లో అది సీరియస్ మేటర్ అయింది.

పెరుగుతున్న పెళ్ళికాని ప్రసాదులు:

ఓ మూడున్నర దశాబ్దాల కాలంగా చూస్తే మన సమాజంలో పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఏ పెళ్లి సంబంధాల గ్రూపులు తిరగేసినా పదింటిలో ఏడెనిమిది అబ్బాయిలవే కనబడేవి. అమ్మాయిలవి అరకొరగా ఉండేవి. అంటే అమ్మాయిలు లేకపోవడం వల్ల కాదు…వాటిని వెల్లడి చేయకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. సకాలంలో పెళ్ళి విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం, కెరీర్ కే ప్రాధాన్యమివ్వడం, పోటాపోటీగా ఆడపిల్లల చదువులూ, ఉద్యోగాలు పెరిగి ఓ పట్టాన పెళ్ళిళ్ళకు ఒప్పుకోకపోవడం ఇందుకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. 

పెళ్ళికాని ప్రసూనలూ కనబడతారేమో:

ఇప్పటి వరకూ పెళ్ళి సంబంధాల గ్రూపుల్లో అబ్బాయిలవే అధికంగా కనబడినా ఇటీవల కాలంలో అమ్మాయిలవి కూడా గణనీయంగా వుంటున్నాయి. పాతికేళ్ల ప్రాయంలో అమ్మాయిలు పైలా పచ్చీస్ గా , తమను తాము అతిగా ఊహించుకుని ఎండమావుల వెనుక పరుగులు పెడుతున్నారు. సెలక్షన్ లో తమదే ప్రధాన ఛాయిస్ గా భావిస్తున్నారు. ఈ భ్రమల్లో ఇంకో పదేళ్ళు గడిచిపోయాక అసలుస్థితి అవగతమవుతుంది. క్రమంగా పెళ్ళికాని ప్రసూనలు పెరిగే ప్రమాదం కనబడుతోంది.

సీనియర్ పెళ్ళి కూతుళ్ళకి మంచి డిమాండ్ :

పెళ్ళిళ్ళ మార్కెట్లో ప్రస్తుతానికి 85-95ల మధ్య పుట్టిన అమ్మాయిలకు(సీనియర్ పెళ్ళి కూతుళ్ళకు)మంచి డిమాండ్ వుంది. పిల్లలు లేకుండా వుంటే వితంతువులు, విడాకులు తీసుకున్న వారైనా ఆమోదమే. ఇదీ సీనియర్ పెళ్ళి కొడుకుల ఆరాటం. విడాకుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం.

ఇలా పెళ్ళిళ్ళు…అలా విడాకులు :

ఇప్పుడు పెళ్ళిళ్ళు అవడం ఆలస్యం, కష్టమవుతోందేమో గానీ విడాకులు మాత్రం ఈజీగా అయిపోతున్నాయి. తమ మాటే వినాలనే పంతం, చిన్న విషయాలను కూడా పెద్దవిగా చూడడం, అసలు సర్దుకుపోయే లక్షణం ఏమాత్రం లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. రెండో పెళ్ళికి కూడా తమ డిమాండ్లు తగ్గించుకోకపోవడం గమనార్హం, గర్హనీయం. ఇంకా చెప్పాలంటే రెండు పెళ్ళిళ్ళు కూడా ఫెయిల్ అయి మూడోసారి పెళ్ళికీ ముచ్చటపడుతున్నవారూ ఇప్పుడు కొందరు తారసపడుతున్నారు. ఒకప్పుడు విదేశీ విష సంస్కృతి అనుకున్నది ఇప్పుడు మదేశంలో కూడా మామూలు వ్యవహారంగా మారింది. వివాహ విలువల పతనానికి ఇదో ఉదాహరణ.

జాతకాలు చూస్తే విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి:

ఇప్పటి సంబంధాలను గమనిస్తే చాలామందితో జాతకాలు కలవలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిజానికి అది పూర్తిగా వాస్తవం కాదని తెలుసు. ఏ కారణంగా నచ్చకపోయినా దానికి జాతకాలనే సాకుగా చూపి తోసేస్తున్నారనీ అర్థమైపోతుంది. ఇందులో తమకు ఆనవాయితీగా చూసే ఆ ప్రత్యేకమైన ఆ గురువుకో, సిద్ధాంతికో సంబంధాలను పంపించి ఓకే అనిపించుకోవాలనే ఓ గుడ్డి నమ్మకం కూడా తప్పని పిస్తోంది. మరి ఆ జాతకుడు ఆమోదముద్ర వేశాక జరిపించిన పెళ్ళిళ్ళు కూడా మూన్నాళ్ళ ముచ్చటగా ఎందుకు ముగుస్తున్నాయనే ఆలోచన రాదా… చేయరా? 

కొత్తతరం వచ్చేసింది:

సంబంధాలు విషయంలో ప్రతి పదేళ్ళకూ ఓ తరంగా లెక్క వేసుకుంటే అప్పుడే మూడోతరం జాబితాలోకి వచ్చేసింది. తొలిదశలో 1980 నుంచి 1990 మధ్య పుట్టిన వాళ్ళ సంబంధాలు రాగా, రెండో దశలో 1990 నుంచి 1999 వరకూ వచ్చారు. ఇలా చూస్తుండగానే అప్పుడే 2000 నుంచీ పుట్టిన వాళ్ళు అందులోనూ అమ్మాయిలు ఎక్కువగా జాబితాల్లోకి వచ్చేశారు. కాబట్టి సీనియర్లు తస్మాత్ జాగ్రత్త.

 

Share to...