Subramanyam Dogiparthi: The first time-travel movie in Indian cine industry . మనకు తెలుగులో సైన్స్ ఫిక్షన్స్ సినిమాలు చాలా తక్కువ . అందులో టైం మెషీన్ అనే కాన్సెప్టే సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఇంకా కొత్త . అలాంటి కధాంశాన్ని సినిమాగా మలిచిన కె వి రెడ్డి గారి శిష్యుడు సింగీతం శ్రీనివాసరావు గారికి తప్పక చప్పట్లు కొట్టాల్సిందే . గురువు గారి మాయాబజార్ సింగీతం గారిని ఆవహించి ఉండి ఉండాలి .
కె వి రెడ్డి గారు యన్టీఆర్ని పికప్ చేస్తే సింగీతం వారు ఆయన కుమారుడు బాలకృష్ణని ఎంచుకున్నారు . అప్పటివరకు రొమాంటిక్ , ఏక్షన్ సినిమాలకు పాపులరయిన బాలకృష్ణని ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా యన్టీఆర్ అంత అందంగా చూపారు సింగీతం . ముఖ్యంగా తెనాలి రామకృష్ణ , బాలకృష్ణ మెకతోక పద్యం అప్పుడు బాలకృష్ణ నవ్వు తెనాలి రామకృష్ణ సినిమాలో యన్టీఆర్ నవ్వుని గుర్తుకు తెస్తుంది .
ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా చారిత్రక కధల కాస్ట్యూమ్సుకు కొత్తయిన బాలకృష్ణ ప్రాక్టీస్ కొరకు తన షూటింగ్ లేకపోయినా ఉదయమే వచ్చి కూర్చునే వాడట ఆ కిరీటంతో . 30 ఏళ్ళ కింద నటులకు అంత క్రమశిక్షణ ఉండేది . కాబట్టే ఈ సినిమాలో బాలకృష్ణకు అంత గొప్ప పేరొచ్చింది . అతని కెరీర్లో ఈ ఆదిత్య 369 ఒక మైలురాయి లాగా నిలిచింది . ఇప్పటికీ చాలా తరచుగా టివిలో వస్తూ ఉంటుంది .
సింగీతం వారు తన టైం మెషీన్లో గతం , భవిష్యత్తు చూపటం వినూత్న ఆలోచన . అందులో గతానికి 1526 లోని శ్రీకృష్ణదేవరాయలుని ఎంచుకోవటమే ఈ సినిమా విజయానికి ప్రధమ కారణం . కాబట్టే బాలకృష్ణని అంత అందంగా చూపగలిగారు . అష్టదిగ్గజాలను ప్రవేశ పెట్టకలిగారు . తెనాలి రామకృష్ణుడిని చూపగలిగారు .
సినిమాలో హాస్య సన్నివేశాలన్నీ ఈ గతం లోనివే . సుత్తి వేలు , శ్రీలక్ష్మి సన్నివేశాలు మరచిపోలేం . అంతేనా ! రాజనర్తకి సిల్క్ స్మిత పాత్ర . ఆమె హొయలు , స్మిత-మోహినిల పోటీ నృత్యం , ఆ పోటీ చివర్లో బాలకృష్ణ మోహినిల రాకెన్ రోల్ హడావుడి !! వ్వాహ్ !!! ఆ మొత్తం సీన్ సినిమాకు గుండెకాయ . అలాగే మూడవ ప్రపంచ యుధ్ధం అయిపోయాక మొత్తం ప్రపంచం విధ్వంసం అయ్యాక , భూతలంపై రేడియేషన్ ఘోరంగా పెరిగి జనం బతికేందుకు భూగర్భం లోకి వెళ్ళిపోవడం , భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా ఉండబోతుందో రుచి చూపించటం సింగీతం వారి సృజనాత్మకతకు పరాకాష్ట .
ఈ సినిమా విజయానికి ఇతర ప్రధాన కారణాలు ఇళయరాజా సంగీతం , వేటూరి , సిరివెన్నెల , వెన్నెలకంటి పాటల సాహిత్యం , సుందరం మాస్టారి , అతని ఇద్దరు కుమారులు ప్రభుదేవా , రాజుల నృత్య దర్శకత్వం .
మొదటగా చెప్పుకోవలసింది రాయల వారి సభలో స్మిత , మోహినిల నృత్య పోటీయే . వేటూరి విరచిత సుర మోదము శుభ నాట్య వేదము నటియించగ తరమా అంటూ సాగే పాటకు వారిరువురి నాట్య ప్రదర్శన అద్భుతం . ఇద్దరూ పోటాపోటీగా నృత్యించారు . స్మితతో ధీటుగా 16 ఏళ్ళ మోహిని నృత్యించటం గొప్ప విషయమే .
ఆదిత్య 369 అనగానే ఎవరికయినా గుర్తుకొచ్చే మధురాతి మధురమైన పాట జాణవులే వర వీణవులే కిలికించితాలలో . అసలు ఈ పదాన్ని ఉపయోగించిన వేటూరిని తప్పక అభినందించాలి . ఈ పాటలో స్మిత నృత్యం , నటన , మహాద్భుతం . అలాగే మరో శ్రావ్యమైన పాట రాసలీల వేళ రాయబారమేల . బాలకృష్ణ మీద సెంచరీలు కొట్టే వయసు మాది బౌండరీలు కొట్టే మనసు మీది గ్రూప్ డాన్స్ కూడా హైలైటే . ఈ డాన్సుని ప్రత్యేకంగా ప్రభుదేవా కంపోజ్ చేసాడట . మరో పాట చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ .
పాటల్ని అత్యంత శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , జానకమ్మ , జిక్కి , చిత్ర , శైలజలు అభినందనీయులు . ఈ సినిమాకు ముగ్గురు దర్శకులు ఫొటోగ్రఫీని హేండిల్ చేసారు . వి యస్సార్ స్వామి చారిత్రక గతాన్ని , కబీర్ లాల్ భవిష్యత్తును , పి సి శ్రీరాం ప్రస్తుతాన్ని హేండిల్ చేసారు .
1895 లో H G Well వ్రాసిన ది టైం మెషీన్ నవల ఈ సినిమాకు స్ఫూర్తి . భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అనే దాని మీద మద్రాసు అమెరికన్ లైబ్రరీలో ఉన్న సైన్స్ ఫిక్షన్ పుస్తకాలను పరిశోధించారట . అంత కష్టపడ్డారు కాబట్టే మాస్టర్ పీస్ అయింది . హిందీ లోకి మిషన్ 369 గా , తమిళం లోకి అపూర్వ శక్తి 369 గా డబ్ చేయబడింది .
ప్రధాన పాత్రలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం , మోహిని ,సిల్క్ స్మిత , టినూ ఆనంద్ , అమ్రీష్ పురి , చలపతిరావు , సుత్తి వేలు , శ్రీలక్ష్మి , జె వి సోమయాజులు , చంద్రమోహన్ , శుభలేఖ సుధాకర్ , బ్రహ్మానందం , కిన్నెర , తదితరులు నటించారు . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది చిచ్చర పిడుగు తరుణ్ . అతనితో పాటు తర్వాత కాలంలో హీరోయినుగా భాసిల్లిన రాశి బాల నటిగా నటించింది .
సుమారు కోటిన్నర రూపాయల ఖర్చుతో తీయబడిన ఈ సినిమాకు కలెక్షన్లు , ప్రశంసలు , అవార్డులు వచ్చాయి . ఉత్తమ కళా దర్శకునిగా పేకేటి రంగాకు , ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనరుగా అల్లాడ సాంబశివరావులకు నంది అవార్డులు వచ్చాయి .
It’s a master piece in not only Telugu film industry but also in the then Indian film industry . A great entertainer too . An unmissable one . ఎన్ని సార్లయనా చూడబుధ్ధి వేసే అందమైన సినిమా కూడా . యూట్యూబులో ఉంది . Enjoy it . 1991 లోనికి వచ్చేసామండోయ్ .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్



