యం.వి.రామారావు: మాఘమాసం వస్తున్నదంటే నేను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన చెప్పాలనిపిస్తుంది. మాఘపౌర్ణమి రోజు సముద్రస్నానం శ్రేష్టమని పెద్దలు చెప్పేవారు.మాఘపౌర్ణమి అనగానే నేను ఇంటర్ చదివే రోజులు గుర్తుకువస్తాయి.ఇంటర్ మొదటి సంవత్సరం బందరు నేషనల్ కాలేజీలో చదువుతున్నాను.నాతో పాటు నా అన్న బీఎస్సీ,మా మేనమామ బీఎడ్ చదువుతున్నారు.ముగ్గురం ఒకే రూంలో ఉండేవారు.మాకు రెండు సైకిల్స్ ఉండేవి.అలాగే బందరులో మా కజిన్స్ ప్రసాద్,మురళి కూడా చదువుతున్నారు.1971 లో సంవత్సరం అనుకుంటా.మాఘపౌర్ణమి వచ్చింది.ఆరోజు అందరూ బందరు సమీపంలోని(10మైళ్లు) మంగినపూడి సముద్రం వద్దకు బయలుదేరాం.వాళ్లందరూ సైకిళ్లపై బయలుదేరారు.అంతదూరం సైకిల్ పై డబుల్స్ కష్టం అని నాకు ఒక రూపాయి ఇచ్చి అక్కడ కలుద్దాం రమ్మన్నారు.
మేము బందరు రాజు పేటలో ఉండేవారం.మా అన్న నన్ను బస్టాండ్ వద్ద దించి రమ్మన్నారు.అప్పుడు మంగినపూడికి ప్రత్యేక బస్సులు వేసేవారు. జనాలు చాలా మంది టిక్కెట్ కోసం లైన్లో నిలుచున్నారు.నాకు టిక్కెట్ దొరికి బస్సు బయలుదేరేసరికి ఉదయం 7గంటలు అయింది.చిలకలపూడి దాటగానే ట్రాఫిక్ జాం అయింది. సింగిల్ రోడ్డు కావడంతో వచ్చే బస్సులు,వెళ్లే బస్సులు,ఇతర వాహనాలతో జాం అయింది.వాహనాలు చాలా నెమ్మదిగా నడిచాయి.దాంతో 8.30 గంటలు అయినా చేరలేదు.కొంతమంది అక్కడి నుంచి జస్ట్ ఒక కి.మీ మాత్రమే అన్నారు.దాంతో కొంతమంది నడిచి వెళితే బస్సు కంటే ముందు వెళ్తామని దిగిపోయారు.నేనూ వారి మాటలు నమ్మి దిగాను.రూపాయిలో టిక్కెట్ 55 పైసలు పోను 45 పైసలు మాత్రమే నావద్ద ఉన్నాయి.ఎంతనడిచినా దూరం తరగడంలేదు.చివరికి నేను మంగినపూడి సుమారు 5కి.మీ నడిచి వెళ్ళేసరికి పొద్దున సైకళ్ల మీద వెళ్లిన వారు తిరిగి వస్తూ కనిపించారు.మా వాళ్లు మాత్రం కనిపించలేదు.నేనునడిచి వెళుతున్నప్పుడు మిగిలిన చిల్లరతోదాహం,ఆకలి వేసిడ్రింక్ తదితరాలు కొనుక్కుని తిన్నాను.సముద్రం దగ్గరికి వెళ్లేసరికి 10 గంటలు దాటింది.ఎండ పెరిగింది.జనం పలచబడ్డారు.నా ఒంటిమీద నిక్కర్ షర్ట్ మినహా ఏమీ లేదు.టవల్ కూడా లేదు.అలాగే సముద్రంలో మునిగి స్నానం చేసాను.విపరీతమైన ఆకలి వేస్తున్నది.సముద్రం వద్ద ఉంటామన్న మావయ్య,అన్న కనిపించలేదు.వెళ్లేందుకు చార్జీలు లేవు. వాళ్ల మీద విపరీతమైన కోపం వచ్చింది.కాని ఏమీ చేయలేని పరిస్థితి.సముద్రంలో కొందరు జామపండ్లు వేసారు.వాటిలో ఒకదాన్ని నీళ్లలో దొరకబుచ్చుకుని తిన్నాను.అయినా ఆకలి తీరలేదు.అలాగే తడి బట్టలతో తిరుగు ప్రయాణం అయ్యాను.మధ్యలో సైకళ్లపై తెలిసిన వాళ్లు వెళుతున్నా వారిని అడగలేను.వారుకూడా చూసిచూడనట్లు వెళ్లిపోయారు. నడిచినడిచి ఆకలితో కాళ్లు నెప్పులతో మధ్యాహ్నం 3 గంటలతరువాత నేను బందరులోని రూంకు చేరాను.అప్పటికే మా మామ,అన్న వచ్చి అన్నం తిని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.నాకు కోపం నషాలానికి అంటింది.వాళ్లను నానా తిట్లు తిట్టాను.వాళ్లు పాపం ఏమి అనలేదు.నేను అంతదూరం నడిచి వచ్చానని కాలేజీలో అందరికీతెలిసింది.ప్రతివాడు జాలి చూపారు.కొంతకాలానికి అంతదూరం 20 కిలృ మీటర్లు నడిచి రావడం, అందులో 16ఏళ్ల వాడిగా అలాంటి అనుభవం కలగడం నిజంగా గొప్ప విషయం గా భావించి బంధువులకు,స్నేహితులకు చెప్పేవాడిని. ఈ సంఘటన జరిగి 54ఏళ్లు దాటినా మరిచిపోలేని స్మృతి గా మిగిలింది.



