Home » Andhra Pradesh » Jagan : కేంద్రంతో జగన్ తాడోపేడో.. సంచలన ఆరోపణలు!

Jagan : కేంద్రంతో జగన్ తాడోపేడో.. సంచలన ఆరోపణలు!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ముసుగు తీసేసారా? బిజెపి విషయంలో ఆయన వైఖరి మారిందా? ఇక తాడోపేడో తేల్చుకుందామని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ఎంపీలకు కీలక టాస్క్ ఇచ్చారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలువరించాలని సూచించారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బిజెపితో పని కాదన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2011 నాటి దూకుడు కనబరచాలని చూస్తున్నారు. బిజెపితో అటు ఇటు తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

 

 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఓడిపోయింది. బిజెపితో జత కలిసిన చంద్రబాబు అప్పట్లో విజయం సాధించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 67 సీట్లు వచ్చాయి. అయితే బిజెపి సహకారంతోనే చంద్రబాబు గెలిచారని భావించారు జగన్. అందుకే బిజెపి నుంచి చంద్రబాబును దూరం చేస్తే బలం తగ్గిపోతుందని భావించారు. ప్రత్యేక హోదా వ్యూహంతో చంద్రబాబు చిక్కేలా చేశారు. బిజెపి నుంచి చంద్రబాబును దూరం చేయగలిగారు. అలా 2019లో అధికారంలోకి రాగలిగారు. అప్పటినుంచి ఇప్పటివరకు బిజెపితో పరోక్ష స్నేహం కొనసాగిస్తూ వచ్చారు. చివరకు తన చిరకాల ప్రత్యర్థి అయిన టిడిపితో బిజెపి భాగస్వామ్య పక్షమైన లెక్క చేయలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది.

 

 జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్( Congress) పార్టీతో పరోక్ష పొత్తు పెట్టుకున్నారన్న అనుమానాలు బిజెపిలో ఉన్నాయి. ఎందుకంటే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. అందులో ఇండియా కూటమి పార్టీలన్నీ పాలుపంచుకున్నాయి. ఒక్క కాంగ్రెస్ తప్ప. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడి ఉంటే ఈపాటికి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో స్నేహం చేసేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అయితే అదే పరిస్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. బిజెపికి దగ్గర కాలేక.. కాంగ్రెస్ బలపడక.. జగన్మోహన్ రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఇదే కూటమి

 ప్రస్తుతం ఎన్డీఏ కు( National democratic Alliance ) తెలుగుదేశం పార్టీ బలమైన మిత్రపక్షం. ఆ పార్టీ మద్దతుతోనే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చారు నరేంద్ర మోడీ. టిడిపి, బిజెపి, జనసేన మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ మూడు పార్టీలు కలిసే నడుస్తాయి. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ సంకేతాలు పంపారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయకత్వం ఉంటుందని తేల్చి చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మరో 15 సంవత్సరాలు పాటు కూటమి కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేయాలని సూచించడం వెనుక గట్టి ప్లాన్ ఉన్నట్లు జగన్ అనుమానిస్తున్నారు. అందుకే రివర్స్ అటాక్ ఇవ్వాలని చూస్తున్నారు.

 

 ప్రభుత్వ మెడికల్ కాలేజీల( government medical colleges ) ప్రైవేటీకరణ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధం అయ్యింది. కానీ అది ప్రైవేటీకరణ కాదని.. పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటూ చెబుతోంది కూటమి ప్రభుత్వం. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ విధానం అంటూ బిజెపికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చెబుతున్నారు. జగన్ ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ కు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయని.. స్వయంగా ప్రధాని దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. బాధ్యతాయుతమైన మంత్రిగా తనను అరెస్టు చేసుకోవచ్చని తేల్చి చెప్పారు సత్య కుమార్ యాదవ్. తద్వారా బిజెపి నుంచి జగన్మోహన్ రెడ్డికి గట్టి హెచ్చరికలు వెళ్లినట్లు అయింది.

ప్రధాని కార్యక్రమం పై అవినీతి ఆరోపణలు

 మరోవైపు జగన్మోహన్ రెడ్డి యోగా దినోత్సవ( yoga day) కార్యక్రమం పై అవినీతి ఆరోపణలు చేశారు. దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో విశాఖలో కార్యక్రమాలు నిర్వహించారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను సమకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులను భరించింది. కానీ జగన్మోహన్ రెడ్డి 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం తొలిసారిగా చేశారు. అయితే ఈ పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ తీసుకోవడం ఖాయం అని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Share to...