ఏపీలో భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) పట్టున్న ప్రాంతాల్లో విశాఖ ఒకటి. మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం పొత్తులో భాగంగా బిజెపికి కేటాయిస్తారని ప్రచారం నడిచింది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు పోటీ చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేసుకున్నారు. దీంతో ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని అంచనాలు వచ్చాయి. కానీ 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కు మరోసారి ఛాన్స్ కల్పించారు. బిజెపికి అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అక్కడ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే జివిఎల్ నరసింహారావు విశాఖపట్నం పార్లమెంట్ స్థానం విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా విశాఖ వేదికగా సంక్రాంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
* బిజెపిలో ఎదుగుతూ..
ప్రకాశం జిల్లాకు( Prakasam district) చెందిన జీవీఎల్ నరసింహారావు బిజెపిలో వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే ఆయనకు ఏపీ కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే పలుకుబడి ఉంది. బిజెపికి ఒక స్ట్రాటజిస్ట్ గా పని చేశారు. సర్వేలు చేయడంలో సిద్ధహస్తుడు. ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి బాధ్యుడిగా వ్యవహరించేవారు. బిజెపి అధికార ప్రతినిధిగా కూడా ప్రమోట్ అయ్యారు. బిజెపి పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు జీవీఎల్ నరసింహారావు. అయితే ఆయన మనస్సు సొంత రాష్ట్రంపై ఏర్పడింది. బిజెపికి క్షేత్రస్థాయిలో బలమున్న విశాఖను ఆయన ఎంచుకున్నారు.
– వైసిపి అనుకూలముద్ర..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైసీపీకి అనుకూలంగా చాలా మంది బిజెపి నేతలు వ్యవహరించే వారన్న ఆరోపణలు ఉండేవి. ప్రధానంగా జీవీఎల్ నరసింహారావు( gvl Narasimha Rao ) వైసీపీకి అనుకూలమన్న కామెంట్స్ వినిపించేవి. కానీ దానిని ఆయన ఎప్పుడూ తిప్పి కొట్టేవారు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అందుకే విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తరచూ రాకపోకలు సాగించేవారు. ఏటా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది కూడా ఆయన సంక్రాంతి వేడుకలకు విశాఖలో సన్నాహాలు చేస్తుండడం విశేషం.
* ఉత్తరాది ప్రజలు ఉండడంతో.. విశాఖలో( Visakhapatnam) ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అధికం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడంతో ఉత్తరాది రాష్ట్ర ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటారు. వారంతా బిజెపికి దగ్గరగా ఉంటారు. అందుకే జివిఎల్ నరసింహారావు కన్ను విశాఖ పై పడింది. అందుకే 2024 ఎన్నికలకు ముందుగానే ఆయన మేల్కొన్నారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వపరంగా కార్యక్రమాలు నిర్వహించేవారు.తాను వ్యక్తిగతంగా సంక్రాంతి వేడుకలు జరిపించేవారు. తరచూ విశాఖపట్నం ప్రజలతో మమేకమై పనిచేసేవారు. టిడిపి తో పొత్తులో భాగంగా ఈ సీటు బిజెపికి కేటాయిస్తారని ప్రచారం నడిచింది. అందుకు జివిఎల్ నరసింహారావు కారణమని అప్పట్లో టాక్ నడిచింది. కానీ ఆ ఎన్నికల్లో బిజెపికి విశాఖపట్నం సిటు ఇవ్వలేదు. అనకాపల్లిని బిజెపి కి కేటాయిస్తే అక్కడ సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. విశాఖలో టిడిపి అభ్యర్థి శ్రీ భరత్ గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో సైతం తాము ఎంపీ అభ్యర్థులు గానే బరిలో దిగుతామని ఈ ఇద్దరు నేతలు చెబుతున్నారు.
* అతిథులకు ఆహ్వానం..
అయితే మరోసారి ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు చేసేందుకు జీవీఎల్ నరసింహారావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఒడిస్సా గవర్నర్ హరిబాబులు సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా రానున్నారు. అయితే విశాఖపై జీవీఎల్ నరసింహారావుకు ఇంకా మమకారం వదల్లేదు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసేందుకే ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విశాఖ ఎంపీగా శ్రీ భరత్ ఉన్నారు. ఆయన నందమూరి బాలకృష్ణ అల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు. వారి ఆశీస్సులు శ్రీ భరత్ కు ఉంటాయి. అటువంటప్పుడు జీవీఎల్ నరసింహారావు ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.



