భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) కేరళలో విస్తరించనుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ప్రాతినిధ్యం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభావం కనిపించింది కేరళలో. ఏకంగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది ఆ పార్టీ. నాలుగు దశాబ్దాలుగా లెఫ్ట్ పార్టీల కూటమి ఆధీనంలో ఉన్న ఈ స్థానం బిజెపికి చిక్కింది. అయితే బిజెపికి బేస్ అంటూ దొరికితే అది ఎలా విస్తరిస్తుందో అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. అందుకే ఇప్పుడు కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడి ఎఫ్ కంగారుపడుతున్నాయి.
అయితే ఇప్పటివరకు బిజెపికి పట్టు చిక్కలేదు కేరళ( Kerala ). దేశవ్యాప్తంగా బలపడుతుంది కానీ బెంగాల్, కేరళ, త్రిపుర, తమిళనాడు వంటి చోట్ల మాత్రం ఉనికి చాటుకోవడానికి కూడా బిజెపి ఇబ్బంది పడుతూ వస్తోంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో బిజెపి మార్కు భావజాలానికి చాలా స్పష్టమైన వ్యతిరేకత ఉండేది. అందుకే ఆ రాష్ట్రాల్లో బిజెపి పాగా వేసేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్టు కోటను కూలగొట్టింది భారతీయ జనతా పార్టీ. పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల ప్లేస్ ను ఎప్పుడో ఆక్రమించింది. ఇప్పుడు కేరళలోనూ అదే చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం చూపింది.
దేశంలో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ ప్రాచుర్యం పొందింది. అక్కడ సుదీర్ఘకాలంగా రెండు కూటములే పాలిస్తూ వచ్చాయి. లెఫ్ట్ ఫ్రంట్( left front) నేతృత్వంలోని వామపక్షాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ మార్చి మార్చి అధికారాన్ని అందుకుంటూ వచ్చాయి. అయితే ఈ రెండు కూటములకు వేర్వేరు భావజాలాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టు కేరళలో తమ పొట్టు నిలుపుకుంటూ వచ్చాయి. అయితే మధ్యలో బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి శబరిమల ఇష్యూ తో కూడా ప్రయత్నించింది. కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు కిందిస్థాయి నుంచి అంటే స్థానిక సంస్థల నుంచి ఎదిగే ప్రయత్నం ఫలించినట్టు కనిపిస్తోంది.
కేరళలో చదువుకునే వారు ఎక్కువ. వారి ఆశలు, ఆకాంక్షలు వేరేలా ఉంటాయి. అక్కడ రాజకీయం కూడా కాస్త స్వచ్చంగానే ఉంటుంది. ప్రజలు ఎవరి భావజాలానికి తగ్గట్టు వారు రాజకీయం చేస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో కేరళ యువత బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తరఫున గెలిచిన వారంతా యువకులే కావడం గమనార్హం. అయితే కమ్యూనిస్టులు బలహీనం అవుతున్న చోటే బిజెపి బలపడుతుండడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలం పెంచుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా కేరళలో సైతం బిజెపికి పట్టు చిక్కడం విశేషం.



