ఏపీలో( Andhra Pradesh) విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారా? జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటమే లక్ష్యంగా పెట్టుకున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఇదే అనుమానం వ్యక్తం అవుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలపై తరచూ విమర్శలు చేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ పై కామెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కూడా అటువంటి వ్యాఖ్యలు చేసి సంచలనానికి కారణమయ్యారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కొన్ని విషయాలను బయటపెట్టనున్నారని ప్రచారం నడుస్తోంది. వైసీపీ సీనియర్లలో కూడా అదే భయం కనిపిస్తోంది.
* రకరకాలుగా ప్రచారం
వాస్తవానికి విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) బిజెపిలో చేరుతారని ప్రచారం నడిచింది. అందుకే ఆయన రాజ్యసభ పదవితో పాటు పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అప్పట్లో టాక్ నడిచింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. మరోవైపు తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ విజయసాయిరెడ్డి ప్రకటనలు చూస్తుంటే మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోటరి మాట వింటున్నారని.. చాలా నష్టపోతున్నారు అనేది విజయసాయిరెడ్డి అభిప్రాయం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగిందని.. దానిని సరి చేసుకోలేరని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటువంటి సమయంలోనే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకుగాను ఆయన పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారంలో ఉంది.
* వైసీపీ వెంట రెడ్డి సామాజిక వర్గం..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ అంటేనే రెడ్డి సామాజిక వర్గం అనే స్థితి ఉండేది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత రెడ్డి సామాజిక వర్గమంతా నడిచింది. అయితే 2024 ఎన్నికల్లో సీన్ మారింది. జగన్మోహన్ రెడ్డి బీసీ నినాదంతో ముందుకు వెళ్లి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నియోజకవర్గాల్లో సైతం బీసీలకు పెద్దపీట వేశారు. పేరు మోసిన రెడ్డి సామాజిక వర్గం నేతలను సైతం తప్పించారు. సహజంగానే ఇది రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తికి కారణమైంది. భారీ ఓటమికి దారితీసింది. మరోసారి రెడ్డి సామాజిక వర్గం జగన్ వైపు టర్న్ అయితే ఇబ్బందులు వస్తాయని టిడిపి కూటమి భావిస్తోంది.
* భారీ వ్యూహంతో..
అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ( Y S Jagan Mohan Reddy )పట్ల విముఖతతో ఉన్న రెడ్డి సామాజిక వర్గం విజయసాయి రెడ్డి వెంట నడుస్తుంది అనే ఆలోచన ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి డ్యామేజ్ తప్పదు. టిడిపి కూటమికి రాజకీయంగా ఇది కలిసి వచ్చే అంశం అవుతుంది. అందుకే విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు వెనుక తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు వైసిపి అనుమానిస్తోంది.
* మద్యం కుంభకోణంలో ఆధారాలు..
ఇప్పటివరకు ఏపీలో మద్యం కుంభకోణం( liqueur scam ) కేసును సిఐడి దర్యాప్తు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈడి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఆ మరుసటి రోజు హాజరుకావాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సైతం నోటీసులు పంపింది. అయితే ఈ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా కాదు. సాక్షిగా వెళ్తున్నారు. కీలకమైన వివరాలు వారికి అందిస్తున్నారు. ఒకవైపు విజయ సాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు.. చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం దాని వెనుక టిడిపి ఉందన్న అనుమానం ఉంది. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగలడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో?



