భారతీయ జనతా పార్టీ ( Bhartiya Janata Party) సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కు బిజెపి హై కమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో బిజెపి నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల బిజెపి సమన్వయకర్తగా నియమించింది. కేంద్ర బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులు, వాటి వల్ల వివిధ సామాజిక వర్గాలకు కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతలను కట్టబెట్టింది. నిజంగా ఇది ఒక అరుదైన గుర్తింపు. రాజ్యసభ మాజీ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావు రాజకీయ అవకాశాలు తగ్గలేదని మరోసారి నిరూపితమైంది.
* South India BJP coordinator
దక్షిణ భారతదేశం బిజెపి కోఆర్డినేటర్( South India BJP coordinator ) పదవి అంటే చిన్న విషయం కాదు. తెలంగాణ, కర్ణాటక, కేరళ,తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బిజెపి సమన్వయకర్తగా జీవీఎల్ నరసింహారావు బాధ్యతలు నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట్ర పార్టీ విభాగాలను సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రాయోజిత పథకాల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో జీవీఎల్ పాత్ర పెరగనుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే అక్కడ విస్తృత ప్రచారం చేయనున్నారు జివిఎల్. తద్వారా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటేలా ఆయన ప్రయత్నాలు జరగనున్నాయి.
* మంచి వ్యూహకర్త..
ప్రజల నాడి పట్టడం జీవీఎల్ నరసింహారావుకు( gvl Narasimha Rao) వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికలు సర్వేలు నిర్వహించడం లోనూ.. వ్యూహరచనలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బిజెపి వ్యూహకర్తల బృందంలో జివిఎల్ ఒకరు. ఆ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడంతో జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు జివిఎల్. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు కూడా. ఎన్నో పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు.
* విశాఖ నుంచి పోటీకి సన్నాహాలు..
రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసిన జీవీఎల్ 2024 ఎన్నికల్లో విశాఖ( Visakhapatnam) పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అంతకుముందు టిడిపి పొత్తు విషయంలో జివిఎల్ కాస్త కఠిన ప్రకటనలు చేశారు. దాని మూలంగా ఆయనకు ఎటువంటి పదవులు దక్కవని అంతా భావించారు. అయితే ఇప్పుడు బిజెపి హై కమాండ్ ఏకంగా దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్తగా జీవీఎల్ పేరును ప్రకటించడం విశేషం.
* ఏదో ఒక రాష్ట్రం నుంచి సర్దుబాటు
మరోవైపు జివిఎల్ నరసింహం కు రాజ్యసభ( Rajya Sabha ) పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. జూన్లో దేశవ్యాప్తంగా 70కు పైగా రాజ్యసభ పదవులు ఖాళీ అవుతాయి. ఏపీ నుంచి నలుగురు పదవీ విరమణ చేస్తారు. అయితే కీలకమైన పదవులన్నీ బిజెపికి దక్కనున్నాయి. ఏపీ నుంచి కానీ.. ఏదైనా రాష్ట్రం నుంచి కానీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ కావడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.



