విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్సీ వర్గాల సామాజిక, రాజకీయ సాధికారత లక్ష్యంగా బిజెపి ఎస్సీ మోర్చా కీలక అడుగులు వేస్తోంది. విజయవాడలో బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మరియు సోషల్ మీడియా కన్వీనర్లతో భారీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ , ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య , మరియు జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ అనిమా సోంకర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
మహాకవి గుర్రం జాషువాకు జాతీయ గౌరవం: తెలుగు నేల గర్వించదగ్గ మహాకవి గుర్రం జాషువా గారిని ‘జాతీయ కవి’గా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయన కీర్తిని చాటిచెప్పేలా రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
53 ఉపకులాలకు సముచిత ప్రాధాన్యత: ఎస్సీ వర్గంలోని మాల, మాదిగ, రెల్లి కులాలతో పాటు మిగిలిన 53 ఉపకులాలను గుర్తించి, వారికి సామాజికంగా మరియు రాజకీయంగా తగిన గౌరవం, ప్రాతినిధ్యం కల్పించేలా బిజెపి కృషి చేస్తుందని నేతలు స్పష్టం చేశారు.
మోదీ పథకాల విస్తృత ప్రచారం: ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.



