Home » Andhra Pradesh » సంక్రాంతి ఎఫెక్ట్.. గోదావరి జిల్లాల్లో పెరిగిన హోటల్ అద్దెలు!

సంక్రాంతి ఎఫెక్ట్.. గోదావరి జిల్లాల్లో పెరిగిన హోటల్ అద్దెలు!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

సంక్రాంతి( Pongal) అంటేనే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. ఏపీ అంతటా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి కానీ.. గోదావరి జిల్లాలో స్పెషల్. ఎందుకంటే అక్కడి పచ్చదనం ఒక ప్రత్యేకత అయితే.. ఆ పచ్చదనం మధ్య కోడిపందాలు ఆడుకుంటూ సరదాగా పిండి వంటలు ఆరగిస్తే సంక్రాంతి మజా వేరేగా ఉంటుంది. అందుకే ఏడాది పొడవునా సంక్రాంతి కోసం ఆ జిల్లా ప్రజలు ఎక్కువగా ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల రూపురేఖలే మారిపోతుంటాయి. ఈసారి కూడా అదే జోష్ తో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు జనం సిద్ధపడుతున్నారు. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. మరోవైపు కోడిపందాల శిబిరాలు రెడీ అవుతున్నాయి. బరులు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.

* భీమవరంలో సందడే సందడి..
గోదావరి జిల్లాల్లో( Godavari districts) సంక్రాంతి పండుగ ఒక ఎత్తు.. భీమవరంలో మరో ఎత్తు అనేలా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఇక్కడ జరిగే కోడిపందాలను చూసేందుకు, ఆడేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. వీరంతా మూడు రోజులపాటు అక్కడే ఉండి కోడిపందాలను తిలకించేందుకు వీలుగా స్థానికంగా హోటల్స్ ను అద్దెకు తీసుకుంటారు. దీంతో ఈసారి హోటల్స్ రూమ్స్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది.

* అన్ని పట్టణాల్లోనూ అంతే..
ఒక్క భీమవరమే( Bhimavaram ) కాదు ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురంలో హోటల్ గదులన్నీ బుక్ అయ్యాయి. ఒక్కటంటే ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదని తెలుస్తోంది. సాధారణంగా రోజుకు 1000 నుంచి 5000 అద్దెకు ఉండే హోటల్ రూములు.. ఇప్పుడు ఏకంగా 30 వేల నుంచి 60 వేల దాకా చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులపాటు తీసుకుంటే గరిష్టంగా లక్ష వరకు చెల్లించక తప్పదు. ప్రధానంగా రాజకీయ నాయకులతోపాటు సాధారణ పర్యాటకుల తాకిడి పెరిగింది గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాలకు.

* కోడిపందాలకు భారీగా ఏర్పాట్లు..
ఈసారి రికార్డ్ స్థాయిలో కోడిపందాలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి. భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా బెట్టింగ్రాయుళ్లు తరలివస్తున్నారు. ఇందులో రాజకీయ నేతలతో పాటు ప్రముఖులు కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. కోడిపందాలను భారీ ఎత్తున నిర్వహిస్తామని స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. దీంతో మరింత జోష్ పెరిగింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా అక్కడ పనిచేయవని స్పష్టం అవుతోంది.

Share to...