తమిళనాడు పై ( Tamilan Nadu ) పూర్తి ఫోకస్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ద్రవిడ ఉద్యమ వాసనలతో బయటపడాలని చూస్తోంది డీఎంకే. ఈ క్రమంలో సనాతన ధర్మం, హిందుత్వవాదం పై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ శాపాలుగా మారే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి కొంత బూస్టప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
* ఉదయనిధి స్టాలిన్ కు షాక్
కొద్ది రోజుల కిందట డీఎంకే యువనేత ఉదయనిది స్టాలిన్( Udaya Nidhi Stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై వ్యతిరేకంగా మాట్లాడారు. దానిని ఒక పురుగుగా వ్యాఖ్యానించారు. మలేరియాతో పోల్చారు. ఆ వ్యాఖ్యలపై హిందూ సమాజం భగ్గుమంది. భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. ఒక విధంగా చెప్పాలంటే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో బిజెపికి మరింత అవకాశం ఇచ్చినట్లు అయింది.
* దశాబ్దాలుగా ఉద్యమం..
పెరియర్ రామస్వామి నాయకర్ ( Periyar Ramaswamy Nayakar )మార్గ నిర్దేశంలో ద్రవిడ ఉద్యమం పుట్టుకొచ్చింది. దశాబ్దాలుగా ఈ ఉద్యమం తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. అయితే ఇప్పుడు ఈ ఉద్యమ స్ఫూర్తి క్రమంగా సన్నగిల్లుతోంది. ఎందుకా ద్రవిడ ఉద్యమం అనేవారు పుట్టుకొస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలతో విసిగిపోయి.. ఇక చాలు అనుకునేవారు తమిళనాడులో పెరుగుతున్నారు.
* డీఎంకే నేతల తీవ్ర వ్యాఖ్యలు..
అయితే డిఎంకె ( dravida munnetra kajagam )నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. చేస్తున్న ప్రకటనలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎంజీఆర్, కరుణానిధి హయాంలోని రాజకీయాలు వేరు. తరువాత జయలలిత కాలంలో జరిగిన రాజకీయాలు వేరు. ఇప్పుడు ద్రవిడ నేతలు చేస్తున్నది వేరు. ఎంజీఆర్, కరుణానిధి పేద పీడిత వర్గాల కోసం పోరాడారు. అప్పట్లో ద్రవిడ సిద్ధాంతాలను నమ్మిన యువతరం సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యం అయింది. రెండు గ్లాసుల విధానం, ఆలయాల్లోకి దళితుల ప్రవేశం కోసం జరిగిన ఉద్యమాలు, దాడులు, ప్రతి దాడులు అప్పటి పరిస్థితులకు నిదర్శనం.
* తమిళుల్లో క్రమేపి మార్పు
జాతీయస్థాయిలో బిజెపి( Bhartiya Janata Party) స్థిరపడిపోయిన తరువాత తమిళుళ్లో క్రమేపి మార్పు వస్తోంది. దేవుడు లేడు అనే ద్రవిడ ఉద్యమ ఆలోచనలు సన్నగిల్లుతున్నాయి. రాముడే దేవుడని విశ్వసించే వాళ్ళు పెరుగుతున్నారు. నిన్నటిదాకా అన్నాడీఎంకే ఓటు బ్యాంకులు గా ఉన్న కొన్ని వర్గాలు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 18% ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ సరళి కొంచెం మారితే బిజెపికి గణనీయమైన సీట్లు ఖాయం. అయితే చేజేతులా ఇప్పుడు డీఎంకే బిజెపికి ఆస్త్రాలు అందిస్తోంది. సనాతన ధర్మంపై విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు డీఎంకే నేతలు. దానిని ఒడిసి పట్టుకునే పనిలో ఉంది భారతీయ జనతా పార్టీ. సనాతన ధర్మంతో పాటు హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ద్రవిడ సిద్ధాంతం సన్నగిల్లుతోంది. పొత్తుల రాజకీయం మరోవైపు నడుస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే తమిళనాడులో బిజెపి ఒక రాజకీయ శక్తిగా అవతరించడం ఖాయమని స్పష్టమవుతోంది.



