అమరావతి: వంట గ్యాస్ సరఫరా పై ప్రజలు ఆందోళన చెందవద్దని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భరోసా ఇచ్చారు . కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ గ్యాస్ కొరత లేకుండా చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ కేంద్ర మంత్రి హర్థీప్ సింగ్ పూరి తో ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులు పై సంభాషించారు. కేంద్ర మంత్రి గ్యాస్ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు .ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో ఇంధన సరఫరాలపై కొంత మేర ప్రభావం పడుతున్నప్పటికీ, అదే పరిస్థితిని సాకుగా చూపిస్తూ కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులపై అదనపు భారం మోపడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీయన్ మాధవ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాను కావాలనే ఆలస్యం చేయడం, స్టాక్ ఉన్నప్పటికీ లేదని చెప్పడం, అలాగే అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటువంటి చర్యలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
గ్యాస్ ఏజెన్సీలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కొందరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రస్తుత పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ కృత్రిమ కొరతను సృష్టించడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత సరఫరా శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై సమగ్రంగా పరిశీలన చేయాలని మాధవ్ కోరారు. అవసరమైతే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.



