శాశ్వత రాజధాని అమరావతే : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• మనసా వాచా కర్మణా మద్దతు
• గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది
• భూములు ఇచ్చిన రైతులను హింసించింది
• రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం
• రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు
• మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి
• రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది
• సరైన ప్రణాళిక లేకుండా విభజించారు
• రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు
• అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది
• అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
Bharat Today : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి.
• తెలుగు నేల అనే భావనే ఉండేది
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.



