Home » Andhra Pradesh » Nallari: రాజ్యసభకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి!

Nallari: రాజ్యసభకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల పదవుల సందడి ప్రారంభం అయింది. వచ్చే జూన్ నాటికి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని తో పాటు టిడిపి సభ్యుడు సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు ఆ నాలుగు సీట్లు టిడిపి కూటమికి దక్కనున్నాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీస స్థాయిలో కూడా బలం లేదు. అయితే తెలుగుదేశం రెండు స్థానాలతో పాటు బిజెపికి ఒకటి, జనసేనకు ఒకటి దక్కే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటివరకు జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. అందుకే ఆ పార్టీకి ఒక పదవి కేటాయించే అవకాశం ఉంది. అయితే టిడిపికి చెందిన సానా సతీష్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కానున్నారు. మరో పదవి కోసం తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ ఉంది.

* బిజెపికి ఒక సీటు..

అయితే బిజెపికి ఒక రాజ్యసభ సీటు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి చాలామంది ఆశావహులు ఉన్నారు. కానీ ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాజంపేటలో పోటీ చేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం కాగా… అక్కడ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మెజారిటీని తగ్గించగలిగారు. అప్పట్లోనే ఎన్డీఏ అధికారంలోకి వస్తే కిరణ్ కుమార్ రెడ్డికి పదవి ఖాయమని ప్రచారం జరిగింది.

* ఆ లక్ష్యంతోనే..

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ నుంచి రాజ్యసభ పదవుల ఎంపిక జరిగింది. ఆ సమయంలో రకరకాల సమీకరణలు తెరపైకి వచ్చాయి. అయితే రాజ్యసభ పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఆర్ కృష్ణయ్యకు మరో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈసారి బిజెపికి దక్కే సీటు కిరణ్ కుమార్ రెడ్డితో భర్తీ చేస్తారని తెలుస్తోంది. రాయలసీమలో పార్టీ బలోపేతంతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించాలన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. అది కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

* ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా..

ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఆయన తనకంటూ ఒక ప్రభావం చూపారు. మంచి పాలన అందించగలిగారు. రాష్ట్ర విభజన జరగకుంటే కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం మరోలా ఉండేది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు మొగ్గుచూపిందో కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. అటు తర్వాత కాంగ్రెస్కు వెళ్లి ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. తిరిగి బిజెపిలోకి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు అదే కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చి రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించాలన్న ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉంది. చూడాలి బిజెపి ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుతాయో..!

Share to...