మెగా బ్రదర్ నాగబాబు( Mega brother nagababu) అసంతృప్తితో ఉన్నారా? మంత్రి పదవి ఇవ్వలేదని మనస్థాపానికి గురయ్యారా? ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంపై ఆగ్రహంగా ఉన్నారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఏడాది కిందట సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎమ్మెల్సీ ని చేశారు కానీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అదిగో ఇదిగో అంటూ నెలలు గడిచాయి. 9 నెలలు అవుతున్న నాగబాబు విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే నాగబాబు ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వ్యూహాత్మకమా? ఉద్దేశపూర్వకమా? అనేది మాత్రం తెలియడం లేదు. దీనిపై రకరకాల చర్చ అయితే మాత్రం నడుస్తోంది.
* మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా..
మెగా ఫ్యామిలీలో( mega family) పవన్ కళ్యాణ్ వెంట నడిచిన తొలి వ్యక్తి నాగబాబు. చిరంజీవితో సహా మెగా వారసులంతా సినిమాల్లో బిజీగా ఉన్నారు. జనసేనకు మద్దతు మాత్రమే తెలిపారు. కానీ జనసేన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంది మాత్రం నాగబాబు మాత్రమే. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. అయితే ఆ ఎన్నికల తరువాత కొద్ది రోజులపాటు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. మళ్లీ 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు.పొ త్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో విరమించుకున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల సమన్వయానికి, ఎన్నికల ప్రచారానికి తన విలువైన సమయాన్ని కేటాయించారు. కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు తప్పకుండా పదవి వస్తుందని ప్రచారం మొదలైంది.
* టిటిడి అధ్యక్ష పదవి ఆఫర్..
తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ( Tirumala Tirupati Devasthanam trust board )అధ్యక్షుడిగా నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అందుకు ఆయన అయీష్టత చూపినట్లు సమాచారం. తనకు పెద్దల సభకు వెళ్లాలని ఉందని తన సన్నిహితుల వద్ద ఆయన చెప్పుకున్నారు. అయితే గత ఏడాది రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో సమీకరణలతో ఆయనకు అవకాశం దక్కలేదు.. దీంతో సీఎం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేసి ఏడాది అవుతోంది. నాగబాబు ఎమ్మెల్సీ అయి కూడా 9 నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు మంత్రి పదవి కేటాయించలేదు. దీంతో నాగబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
* ఆరు నెలలు ఆగాల్సిందే..
రాష్ట్ర మంత్రివర్గంలో 24 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) డిప్యూటీ సీఎం హోదాతో ఉన్నారు. ఉన్న ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి నాగబాబుతో భర్తీ చేస్తారని అంతా భావించారు. అయితే కూటమి పాలనకు 18 నెలలు అవుతుంది. మరో ఆరు నెలల్లో రెండేళ్ల పాలన పూర్తి కానుంది. అటు తరువాత మంత్రివర్గ విస్తరణ చేపడతారని.. అప్పుడే నాగబాబుకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మరి చూడాలి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?



