Home » Andhra Pradesh » చాయ్ కంటే చీప్.. రోడ్లపై టమాట.. రైతుకు ఏంటి దుస్థితి?!

చాయ్ కంటే చీప్.. రోడ్లపై టమాట.. రైతుకు ఏంటి దుస్థితి?!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

టమాటా( tomato) లేని కూర. టమాటా వాడని ఆహార పదార్ధము ఉండదు. అందుకే ఎంత ధర ఉన్నా టమాటాను కొనాల్సిందే. అయితే ఒక్కో సందర్భంలో టమాటా కిలో వంద రూపాయలు కూడా దాటిపోయాయి. అటువంటిది ఇప్పుడు డెడ్ చీప్ గా మారింది టమాట. కిలో టమాటా పది రూపాయలు లోపే లభిస్తోంది. చాయ్ కంటే చీప్ గా మారింది టమాట ధర. గత కొద్ది నెలలుగా సిరులు కురిపించిన టమాటా ధర ఇప్పుడు దారుణంగా పడిపోయింది. మార్కెట్లో కేజీ టమాటా ధర 5 రూపాయల నుంచి పది రూపాయల లోపే ఉంది. ఈ ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటా కోత, రవాణా చేసినందుకు అయ్యే ఖర్చు కూడా మిగలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్ కు తరలించినా ఉపయోగం లేదని వాపోతున్నారు. ఒక్కసారిగా ధర పతనం కావడంతో ఆందోళనలో ఉన్నారు. అయితే ధర అందుబాటులోకి రావడంతో కొనుగోలుదారులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 * అలా పెరిగి.. ఇలా తగ్గి

 కార్తీక మాసంలో అయితే టమాటా ధర భారీగా పెరిగింది. కిలో టమాట 50 రూపాయల వరకు ఎగబాకింది. అంతకుముందు అయితే 100 రూపాయల వరకు కిలో ధర పాకిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అమాంతం ధర పడిపోయింది. జనవరి మొదటి వారంలో కిలో టమాటా పది నుంచి 20 రూపాయల మధ్య పలికింది. ఇప్పుడేమో దారుణంగా కేజీ ఐదు రూపాయల నుంచి పది రూపాయల మధ్య ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రైతుల వద్ద నుంచి ఐదు రూపాయలకు కొనుగోలు చేసి.. రిటైల్ మార్కెట్లో మాత్రం 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. టమాటా పంట నాణ్యత సరిగా లేకపోవడంతోనే ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు మాత్రం వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 * కర్నూలు జిల్లాలో..

 కర్నూలు జిల్లా( Kurnool district) పత్తికొండ, ప్యాపిలి టమాటా మార్కెట్ కు పెట్టింది పేరు. ఇక్కడ ప్రధాన మార్కెట్లలో కిలో టమాట ధర కేవలం ఐదు రూపాయలు మాత్రమే పడుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోతోంది. కనీసం పొలం నుంచి మార్కెట్కు తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు, కూలీల వేతనాలు కూడా రావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పండించిన పంటను అమ్ముకోలేక, మార్కెట్కు తరలిస్తే నష్టాలు తప్పవని భావించిన కొందరు రైతులు టమోటాలను రోడ్లపై పారబోస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.

 * ఏటా ఇదే పరిస్థితి..

 ఏటా టమాటా రైతుకు ఈ పరిస్థితి తప్పడం లేదు. పంట రైతుకు చేతికి అందే సమయంలో ధర ఉండడం లేదు. ధర ఉన్నప్పుడు రైతు పండించలేకపోతున్నాడు. అంటే పంట పండే సమయానికి ధర తగ్గిస్తున్నారు. వంట లేకపోయినా సమయంలో కృత్రిమ కొరత సృష్టించి కొనుగోలుదారులను దోచుకుంటున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఉన్నా టమాటా విషయంలో మాత్రం న్యాయం జరగడం లేదు. టమాటా ధరల స్థిరీకరణ అంటూ లేదు. దీంతో రైతులు తమ పంటలను అమ్ముకోలేక రోడ్లపై పారబోస్తుండడం మాత్రం నిజంగా దురదృష్టకరం. చివరకు రెండు నిమిషాలపాటు తాగే చాయ్ కంటే కుటుంబమంతా తినే టమాటా కిలో ధర పతనం కావడం రైతుల పాలిట శాపంగా మారింది.

Share to...