Home » Andhra Pradesh » Kcr: చంద్రబాబును వీడని కెసిఆర్.. మళ్లీ అదే ఫైర్!

Kcr: చంద్రబాబును వీడని కెసిఆర్.. మళ్లీ అదే ఫైర్!

Published By: BharattodayTV Team
Published On
IND vs SA T20

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. సెటైరికల్ గా మాట్లాడారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులపై వ్యంగ్యోస్త్రాలు సంధించారు. అవి వంట మనుషులతో చేసుకున్న ఒప్పందాలు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబువి బిజినెస్ ఆలోచనలు అంటూ కామెంట్స్ చేశారు. తద్వారా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు అని సంకేతాలు పంపించారు కేసిఆర్. అయితే ఇప్పుడు కెసిఆర్ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డికి లాభమా? నష్టమా అన్న చర్చ జరుగుతోంది.

 చంద్రబాబు( Chandrababu) కెసిఆర్ మధ్య దశాబ్దాల వైరం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తితో టిడిపి నుంచి బయటకు వచ్చేసిన కేసిఆర్ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో టిఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వారి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కెసిఆర్ పట్టు బిగించారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు నేతల మధ్య శత్రుత్వం పెరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ కు స్నేహితుడయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు సహకరించారు కేసీఆర్. అయితే వీరిద్దరి మధ్య రాష్ట్రాల ప్రయోజనాలు కంటే అధికం అయ్యాయి.

 ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) గద్దె దించి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. తెలంగాణలో కెసిఆర్ పార్టీ ఓడిపోయి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రేవంత్ కు టిడిపి సహకారం ఉందన్నది కేసీఆర్ కోపం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తటస్థంగా ఉంటూ టిడిపికి మద్దతు తెలిపింది. టిడిపి నుంచి వెళ్లిన రేవంత్ రెడ్డికి క్యాడర్ మొత్తం అండగా నిలిచింది. అలా రేవంత్ సీఎం అయ్యేందుకు దోహదపడ్డారు చంద్రబాబు. తద్వారా రిటర్న్ గిఫ్ ఇచ్చానని సంబరపడిన కెసిఆర్ కు గట్టిగా బదులిచ్చారు చంద్రబాబు.

 అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పట్టు బిగిస్తుండడం.. ఏపీలో చంద్రబాబు తనదైన మార్కుతో ముందుకు వెళుతుండడం కెసిఆర్ కు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అందుకే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కెసిఆర్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ గురువుకు తగ్గ శిష్యుడే అని చెబుతూ.. ఏపీలో పెట్టుబడులపై మాట్లాడారు కెసిఆర్. అవంత వంట మనుషులతో చేసుకున్న ఒప్పందాలు అంటూ తేలిగ్గా మాట్లాడారు. చాలా ఇబ్బందికర వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క విమర్శ చేసేవారు కాదు రాష్ట్రం పైన రాష్ట్ర నేతల పైన.. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబుపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.

 జగన్మోహన్ రెడ్డి తో పాటు కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ కంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇక్కడ కూటమి దూకుడుగా ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో మళ్లీ రాజకీయం చేయవచ్చన్న ఆలోచనతో రంగంలోకి దిగారు కేసీఆర్. ఈ క్రమంలో తన రాజకీయ బద్ద శత్రువైన చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసుకున్నారు కేసీఆర్. తద్వారా తన మద్దతు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కేనని తేల్చేశారు. మున్ముందు మరిన్ని విమర్శలు చేస్తానంటూ కూడా సంకేతాలు పంపారు.

Share to...