కదిరి టెంపుల్ టూరిజం సర్క్యూట్‌పై ఎమ్మెల్యే కందికుంట విజన్ ఇదే!
మొన్న కదిరిలో వైకుంఠ ఏకాదశి వైభోగం.. నిన్న కటారుపల్లిలో యోగివేమన జయంతి వేడుకలు.. నేడు గూటిబైలులో మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమాంబ ఉత్సవాలు.. కదిరి కీర్తిని దశ దిశలా వ్యాపింప చేశాయి. ఈ ఉత్సవాలను కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ తన భుజస్కందాలపై వేసుకొని నిర్వహించారు. కదిరిలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలు నిర్వహించడం సాధారణమే. అయితే ఈసారి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో.. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి చేయించిన అలంకరణ, ఏర్పాట్లు భక్తులను పరవశింపజేశాయి. కటారుపల్లిలో యోగి వేమన జయంతి వేడుకలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించిన ఘనత కందికుంటకే దక్కుతుంది. ఇప్పుడు మహాశివరాత్రి ని పురస్కరించుకొని గూటిబైలు గ్రామం వద్ద వెలసిన తిమ్మమాంబ ఉత్సవాలను మునుపెన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో నిర్వహించి చరిత్ర సృష్టించారు. తిమ్మమ్మ మర్రిమాను 1989 సంవత్సరంలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నప్పటికీ… ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పాలి. అక్కడ కనీస వసతులు, రహదారి సౌకర్యాలు లేవు. తన విజన్ ‘కదిరి టూరిజం సర్క్యూట్’ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈసారి తిమ్మమాంబ ఉత్సవాలను తిరుగులేని స్థాయిలో నిర్వహించి ఎమ్మెల్యే కందికుంట సక్సెస్ అయ్యారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈషా ఫౌండేషన్ వారు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఒప్పుకోవడం ఆషామాషీ విషయం కాదు. వారిని కందికుంట మెప్పించి ఒప్పించి సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను తన్మయత్వం పొందేలా చేయడంలో ఆయన తీసుకున్న చొరవ అభినందనీయం. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ఎస్పీ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారంటే ఏ స్థాయిలో ఉత్సవాలు జరిగాయో ఊహించుకోవచ్చు. గడచిన పది రోజులుగా మండల, నియోజకవర్గ స్థాయి యంత్రాంగమంతా తిమ్మమ్మ మర్రిమాను వద్ద అహర్నిశలు పనిచేసింది. అప్పటికప్పుడు ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి రోడ్లు వేయించడం, అక్కడ ఏర్పాట్లు, మూడు రోజులపాటు భోజన వసతి కల్పించడంలో ఆయన చూపిన దాతృత్వం మరువలేనిది. తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఐదు కోట్లతో కమ్యూనిటీ హాలు నిర్మించడానికి ఆయన ముందుకు రావడం ఎంతైనా చెప్పుకోదగ్గ విషయం. అంతకుముందు కదిరిలో ముస్లిం సోదరులు భారీ స్థాయిలో నిర్వహించిన ఇజితిమా కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు సైతం దగ్గరుండి చేయించారు.
రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంక్
కదిరి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, కష్టకాలంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తల అభిమానాన్ని తలచుకొని తిమ్మమాంబ ఉత్సవాల సందర్భంగా కందికుంట భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేనప్పటికీ.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా గత 20 ఏళ్లుగా అండగా నిలిచిన కదిరి ప్రజలు, టిడిపి కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి తన వంతు అహర్నిశలు కష్టపడి పని చేస్తానని బరువెక్కిన హృదయంతో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. ప్రజలు, కార్యకర్తల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ను తెలియజేశాయి. అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టే ఆయనకు రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు వచ్చింది. ఏది ఏమైనా ఆయన కదిరి ప్రాంతాన్ని టెంపుల్ సర్క్యూట్ గా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావాలని.. ఆయన స్వప్నం నెరవేరాలని ఆకాంక్షిద్దాం.



