మాజీ మంత్రికి కాలం కలిసి వస్తోందా? కీలకమైన పదవి దక్కబోతోందా? క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ సమీకరణలో భాగంగా ఆయనకు ఈసారి మంత్రి పదవి దక్కలేదు. అయితే ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా కథ? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.
గంటా శ్రీనివాసరావు( Ghanta Srinivasa Rao ).. తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పాతికేళ్లుగా ఓటమి ఎరుగని నేత. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా. 1999లో అనకాపల్లి ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొన్నటి ఎన్నికల్లో భీమిలి నుంచి 90000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో దక్కలేదు. అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ పోస్టు ఇచ్చారు. విశాఖ జిల్లాకు చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. దీంతో గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవికి ఛాన్స్ లేకుండా పోయింది.
* దూకుడు పెంచిన నేత..
అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. గతానికి భిన్నంగా జోరు పెంచారు. విశాఖకు భారీగా పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. అయితే ఈ పరిశ్రమలన్నీ భీమిలి నియోజకవర్గంలోనే ఏర్పాటు అవుతుండడం గమనార్హం. దీంతో రాష్ట్రంలోనే భీమిలి నియోజకవర్గం ప్రత్యేక ప్రాంతంగా గుర్తింపు పొందింది. భీమిలి మండలంలోని అన్నవరంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. భీమిలి టు భోగాపురం దాకా టూరిజం డెస్టినీ అవుతోంది..
* భూ సేకరణకు సమస్యలు లేకుండా..
భారీగా పరిశ్రమలు తరలివస్తున్న క్రమంలో ప్రభుత్వం భూములను కేటాయిస్తోంది. కానీ భూ సేకరణ అనేది ఇష్యూ గా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ కు( Google data centre) భూములు ఇవ్వమని కొంతమంది రైతులు ఆందోళన చేస్తే గంటా శ్రీనివాసరావు సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశారు. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఈ ఇష్యూను కొలిక్కి తెచ్చారు. దీంతో చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం గంటా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు.
* క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి..
ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరానున్నాయి. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యింది. జూలై నుంచి అధికారికంగా విమానాలు రాకపోకలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు భారీగా పరిశ్రమలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఆ పరిశ్రమలకు భూముల సేకరణ చాలా అవసరం. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు గంటా శ్రీనివాసరావు సేవలను వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. లోకేష్ సైతం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎకనమిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గంటా శ్రీనివాసరావును నియమిస్తారని టాక్ నడుస్తోంది. ఇది క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ఈ పదవి బాధ్యతలను కట్టబెడతారని తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.



