ఏపీ పై బిజెపి ఫుల్ ఫోకస్ పెట్టిందా? పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? కేంద్ర మంత్రివర్గంలో మరో బిజెపి ఎంపీ కి అవకాశం ఇవ్వనుందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కేంద్ర క్యాబినెట్లో ఇప్పటికే ఒకరికి అవకాశం ఉంది. నరసాపురం నుంచి బిజెపి అభ్యర్థిగా గెలిచిన భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అయితే బిజెపికి మరో మంత్రి పదవి ఇచ్చి ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజ్యసభ సభ్యులకు కేంద్రమంత్రి పదవి ఇస్తారా? లేకుంటే మిగిలిన ఇద్దరు ఎంపీలు ఒకరికి ఛాన్స్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరో బిజెపి ఎంపీ కి కేంద్రమంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఆరు పార్లమెంటు స్థానాలకు పోటీ చేసింది. మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుండి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గెలిచారు. అయితే పురందేశ్వరికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. ఎందుకంటే అప్పటికే ఆమె ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆపై ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఎన్టీఆర్ కుమార్తెగా జాతీయస్థాయిలో గుర్తింపు. అన్నింటికి మించి ఏపీలో కూటమి కట్టడంలో, బిజెపికి ఓట్లతో పాటు సీట్లు పెంచడంలో ఆమె పాత్ర కీలకం. దీంతో ఆమెకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ ఎందుకో ఆమెను పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు విస్తరణలో భాగంగా ఆమెకు చాన్స్ దక్కుతుంది అన్న టాక్ వినిపిస్తోంది.
ఇంకోవైపు అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన అనుకోని రీతిలో బిజెపిలోకి వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి కట్టడానికి ఆయన ఒక కారణం. రాయలసీమకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లి వచ్చి మరి పోటీ చేసి గెలిచారు. ఆయన బీసీ సామాజిక వర్గం కోటాలో కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. ఒకవేళ బిజెపి ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇస్తామంటే చంద్రబాబు అభ్యంతరం తెలపరు. ఆపై ఏపీ బీజేపీలో తనకంటూ ఒక ముద్ర చాటుకుంటున్నారు. బిజెపి ఏపీ చీఫ్ మాధవ్ నియామకం వెనుక కూడా సీఎం రమేష్ ఉన్నారన్నది ఒక వాదన. కేంద్ర పెద్దల వద్ద సైతం పలుకుబడి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం రమేష్ కు కేంద్రమంత్రి పదవి ఇస్తారని జోరుగా ఊహాగానాలు రేగుతున్నాయి. ఈ మొత్తం పరిస్థితులు చూస్తుంటే మాత్రం పురందేశ్వరి, సీఎం రమేష్ లలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని తేలుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?



