PV Sunil kumar: వైసీపీ ప్రభుత్వలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీ చిత్రహింసల కేసులో సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ విచారణ ముగిసింది. గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన ఆయనను ఈ కేసు దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రశ్నించారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సునీల్ కుమార్ ముక్తసరి సమాధానాలే చెప్పినట్లు సమాచారం. ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదన్న రీతిలోనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
సీఐడీ కస్టడీలోకి తీసుకున్న రఘురామకృష్ణరాజును చిత్రహింసలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 2021 మే14న హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి రఘరామను ఎందుకు తీసుకొచ్చారు..? ఆయనను ఎవరు కొట్టమన్నారు..? ముసుగు ధరించి వచ్చింది ఎవరు.. వారిని పంపిందెవరు..? మీరు వ్యక్తిగతంగా ఆయనను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది..? ఈకేసుకు మీకు సంబంధం ఏమిటి..? ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారు..? ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా తనకు తెలియదు.. గుర్తు లేదంటూ మౌనంగానే ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం ఆన్సర్ చెప్పినట్లు తెలుస్తోంది. విచారణకు సునీల్ సహకరించకపోవడంతో మళ్లీ విచారణకు పిలవనున్నారు.
వైసీసీ ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉన్నారు. అయితే పలు అభిప్రాయ భేదాలతో నాటి ప్రభుత్వ పెద్దలతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే 2021లో రఘురామను రాజద్రోహం కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎంపీ అని చూడకుండా బలవంతంగా హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం విచారణ పేరుతో ఆయనను చిత్ర హింసలకు గురిచేశారు. ఈ క్రమంలో రఘురామ కాళ్లు, చేతులకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ ఎంపీని ఇలా చిత్రహింసలకు గురిచేయడంపై ఇతర పార్టీల ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని రఘురామ ఫిర్యాదును నాడు పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసులో కదలిక వచ్చింది. నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అప్పటి అదనపు ఎస్పీ విజయ్ పాల్ సహా మరికొందరు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇక విచారణకు రావాలని గతంలోనే సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారని విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు మూడు వారాల గడువు కావాలని కోరారు. కానీ అందుకు నిరాకరించిన విచారణాధికారి దామోదర్ డిసెంబర్ 15న తప్పనిసరిగా హాజరుకావాలని మరోసారి నోటీసులను జారీ చేశారు. దీంతో సోమవారం ఉదయం విచారణ నిమిత్తం గుంటూరులోని సీసీఎస్‌కు వచ్చారు. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించారు. ఇద్దరు వీఆర్వోల సమక్షంలో విచారణ పూర్తయింది. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరించారు. విచారణ నేపథ్యంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు పర్యవేక్షించారు.



