బిజెపి( Bhartiya Janata Party) నెక్స్ట్ ప్లాన్ ఏంటి? బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది? బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ కన్ను ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై పడింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు పై ఫుల్ ఫోకస్ చేసింది బిజెపి. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎలాగైనా పట్టు బిగించాలని బిజెపి భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ బృందాలు తమిళనాడు చేరుకున్నట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ బృందాలకు దిశా నిర్దేశం చేసి తమిళనాడుకు పంపించారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో 210 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహరచనకు ఆరు బృందాలు ఇప్పటికే తమిళనాడుకు చేరుకోవడం విశేషం.
* పొత్తుల ద్వారా అధికారం..
2021లో తమిళనాడు( Tamil Nadu ) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చింది స్టాలిన్ నేతృత్వంలో. ఏకంగా డీఎంకే కూటమికి 159 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగిస్తూ డీఎంకే పట్టు సాధించింది తమిళనాడులో. అయితే ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీసం ఖాతా తెరవలేదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి మాత్రం బిజెపి ఓట్ల పరంగా గణనీయమైన వృద్ధి సాధించింది. ఏకంగా 12 శాతం ఓట్లను సాధించగలిగింది. అప్పటినుంచి తమిళనాడు పై ఫుల్ ఫోకస్ చేసింది బిజెపి. ఇప్పటికే ఉన్న అన్నాడీఎంకేతో పాటు విజయ్ పార్టీతో కలిపి పొత్తు పెట్టుకుంటే.. అధికార డిఎంకె కూటమిని మట్టికరించవచ్చన్న ఆలోచనకు వచ్చింది.
* బలాబలాలు ఇవి..
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డిఎంకెకు( dravida munnetra kachigam ) 133 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అన్నా డీఎంకే 66 స్థానాలతో ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 18, సిపిఎం 17, సిపిఐ 17, టీఎంసీ 6, ఎండిఎంకే నాలుగు, ఐయూఎంఎల్ కు ఒక ఎమ్మెల్యే సీటు ఉంది. 2021 ఎన్నికల్లో బిజెపి వంటరి పోరాటం చేసింది.. అప్పుడే అన్నా డీఎంకేతో జతకలిసి ఉంటే గణనీయమైన సీట్లతో పాటు ఓట్లు సొంతం చేసుకునేది. అయినా సరే 12% ఓటు బ్యాంకుతో సత్తా చాటింది. సీట్ల పరంగా వెనుకబడినా.. ఓట్ల పరంగా మాత్రం వృద్ధి సాధించింది.
* అమిత్ షా వ్యూహంతో…
సాధారణంగా ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బిజెపి హై కమాండ్ ప్రత్యేక నేతల బృందాన్ని పంపించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈసారి తమిళనాడుకు ముందుగానే ఆరు బృందాలను పంపించారు హోం శాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ). ఎన్నికలు ఏడాది ఉండగా ఈ బృందాలు రంగంలోకి దిగుతాయి. ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తాయి. ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి? ఏ పార్టీతో వెళ్తే లాభం? ఏ అజెండాతో ముందుకెళ్తే ప్రయోజనం? అనే వాటిని అధ్యయనం చేస్తాయి ఈ బృందాలు. ప్రస్తుతం తమిళనాడులో అదే పనిలో ఉన్నాయి ఈ నేతల బృందాలు.



