విజయనగరం( Vijayanagaram) జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో అందరి దృష్టి ఇప్పుడు విజయనగరం పైనే ఉంది. అందుకే అక్కడ రాజకీయాన్ని పదిల పరుచుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చాలా రకాల ప్రయోగాలకు వేదిక కానుంది విజయనగరం జిల్లా. మొన్నటి ఎన్నికల వరకు సీనియర్ నేత బొత్స హవా నడిచింది. ఆయన కుటుంబమంతా రాజకీయం చేసింది. కానీ 2024 ఎన్నికల్లో బొత్స తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. అయితే ఇదే పట్టును కొనసాగించాలని చూస్తోంది టిడిపి కూటమి. ఎందుకంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో ఉత్తరాంధ్రకు ఇప్పుడు విజయనగరం కేంద్రంగా మారింది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి గట్టి ప్లాన్ తో ఉంది.
* నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో విమానాశ్రయం..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం( bhogapuram International Airport) నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే లోకం కళ్యాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గంలో ప్రాధాన్యతాంశంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి ఆ నియోజకవర్గాన్ని కోరుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం. రాష్ట్రస్థాయిలో పొత్తులు, ఆపై పవన్ కళ్యాణ్ కోరేసరికి తెలుగుదేశం పార్టీ వదులుకోవాల్సి వచ్చింది. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక్కడ నుంచి టిడిపి పోటీ చేస్తుందని ఆ జిల్లా నేతలు చెబుతున్నారు.
* విజయనగరం వైపు చూపు..
అయితే జనసేన( janasena ) నెల్లిమర్ల నియోజకవర్గాన్ని వదులుకుంటే దాని బదులు ఏ నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయిస్తారు అంటే.. అందరి కళ్ళు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పై చూపిస్తున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే అక్కడ జనసేన పోటీ చేస్తుందని ప్రచారం నడిచింది. దానికి కారణం తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటమే. అయితే అశోక్ గజపతిరాజు పట్టు పడడంతో కుమార్తె అదితి గజపతిరాజుకు చాన్స్ ఇచ్చారు. విజయనగరం బదులు నెల్లిమర్ల నియోజకవర్గాన్ని కేటాయించారు. అయితే ఇప్పుడు పొలిటికల్ సినారే మారుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఆ సీటు జనసేనకు కేటాయించి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పిస్తారని ప్రచారం నడుస్తోంది.
* జనసేనకు బలమైన నేత..
జనసేనకు ఇక్కడ బలమైన నాయకురాలు ఉన్నారు. పాలవలస యశస్విని( palavalasa Yashaswini) అనే నాయకురాలు జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. ఆవిడకే టిక్కెట్ ఇస్తారని ప్రచారం నడిచింది. ఆ చాన్స్ లేకపోయేసరికి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఒకవేళ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి డిమాండ్ వస్తే విజయనగరం జనసేనకు కేటాయించడం ఖాయం. ఆ సామాజిక వర్గానికి చెందిన పాలవలస యశస్వినికి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని టిడిపి దక్కించుకుంటుందన్నది విశ్లేషకుల మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.



